‘న్యాయమూర్తి’ ఎదురుచూపులు.. టైం సెన్స్ లేని అధికారులు, ప్రజాప్రతినిధులు

by Sridhar Babu |
‘న్యాయమూర్తి’ ఎదురుచూపులు.. టైం సెన్స్ లేని అధికారులు, ప్రజాప్రతినిధులు
X

దిశ, జగిత్యాల : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ అవగాహన సదస్సుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలస్యంగా రావడం పట్ల వారి కోసం ధర్మపురి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యూడీషియల్ ‘ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ప్రతీక్ సిహాగ్’ ఎదురుచూడాల్సి వచ్చింది. సరిగ్గా సదస్సు ప్రారంభం కావాల్సిన సమయానికి ముందే హాజరైన జడ్జి ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారుల రాకకోసం ఎదురు చూడాల్సి రావడం అందరినీ ఆచ్చర్యానికి గురిచేసింది.

సదస్సుకు హాజరైన ప్రజలు అసహనానికి లోనయ్యారు. మన నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంకా కూడా మారకపోవడం, సమయపాలన పాటించకపోవడం చాలా బాధాకరం అని గుసగుసలాడారు. న్యాయమూర్తితో సహా న్యాయవాదులు, ప్రముఖులు, స్థానిక నేతలు, స్వచ్ఛంద సంస్థల వారు, జర్నలిస్టులు కూడా అసహనానికి లోనయ్యారు. అప్పటికే ఆలస్యం అయిందని గ్రహించి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సదస్సు ప్రారంభించారు. సదస్సు నడుస్తుండగా మధ్యంతరంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

ఒక న్యాయమూర్తి హాజరైన న్యాయ సదస్సుకే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆలస్యంగా హాజరవుతున్నారంటే ఇక వారి పాలనా విధానం, సమయపాలన ఎలా ఉందో చెప్పకనే చెబుతోందని ప్రజలు ముచ్చటించారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వారి వైఖరి మార్చుకొని సమయస్ఫూర్తితో వ్యవహరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అంతే కాకుండా అతిథులుగా అవగాహన కల్పించేందుకు వచ్చిన న్యాయ సలహాదారులకు, న్యాయవాదులకు వేదికపై కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎలాంటి పిలుపు లేకుండానే ఆ కుర్చీలలో స్థానిక ‘చోటా – మోటా’ నాయకులు దర్జాగా వేదికపైకి వెళ్లి కుర్చీలను ఆక్రమించుకొని కూర్చోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. వీరి ప్రవర్తనతో సదస్సుకు హాజరైన న్యాయ సలహాదారులకే వేదిక పై కుర్చీలు కరువయ్యాయి. నాయకుల ప్రవర్తనా తీరు, వేదికపై ఉన్న కుర్చీలను సైతం కబ్జా చేసి కూర్చోవడం పట్ల అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. సదస్సుకు హాజరైన ప్రజలు వివిధ కోణాల్లో పలు ఆరోపణలు వెలిబుచ్చారు.

Advertisement

Next Story

Most Viewed