ఆధార్ అనుసంధానికి అదే చివరి రోజు: దాన కిషోర్

by Shyam |
ఆధార్ అనుసంధానికి అదే చివరి రోజు: దాన కిషోర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: న‌గ‌రంలో ఉచిత తాగునీటి ప‌థ‌కానికి అర్హులైన వినియోగ‌దారులకు నీటి మీట‌ర్ల ఏర్పాటు, న‌ల్లా క‌నెక్షన్‌కు ఆధార్ అనుసంధానాకి ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తున్నట్టు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి ప‌థ‌కం అమ‌లు, పురోగ‌తిపై గురువారం జ‌ల‌మండ‌లి అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండలి ప్రధాన కార్యాల‌యంలో నిర్వహించిన ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ నెల 31 వరకూ ఉన్న గడువు పొడగిస్తున్నట్లు అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. మీ-సేవ కేంద్రాల్లో, జ‌ల‌మండ‌లి వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కూడా ఆధార్ అనుసంధానం చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించామ‌ని తెలిపారు.

ఆధార్ అనుసంధాన ప్రక్రియ‌ను పూర్తి చేయ‌డానికి సెక్షన్‌కు ఒక ఆధార్ బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఇప్పటివరకు డొమెస్టిక్ స్లమ్‌ల్లో ఆధార్ అనుసంధాన ప్రక్రియ 50 శాతం పూర్తయిన‌ట్టు, ఈ కేటగిరీలో మొత్తం 2,00,785 కనెక్షన్లు ఉండగా 1,05,892 కనెక్షన్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. డొమెస్టిక్ కేటగిరీలో మొత్తం 7,64,568 కనెక్షన్లు ఉండగా 1,52,588 కనెక్షన్లకు ఆధార్ లింక్ ప్రక్రియ పూర్తయిందన్నారు. బల్క్ కేటగిరీలో 22,111 కనెక్షన్లకు గానూ 1,594 కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం సత్యనారాయణ, ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్ -1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed