బీజేపీని ఎదురించే ద‌మ్ము, ధైర్యం కేసీఆర్‌కు ఎక్క‌డిది?

by Shyam |   ( Updated:2021-12-10 03:58:59.0  )
బీజేపీని ఎదురించే ద‌మ్ము, ధైర్యం కేసీఆర్‌కు ఎక్క‌డిది?
X

దిశ‌, అందోల్: రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసుగుచెందారు, ఈ కుటుంబ వ్యవస్థను ప్రతిఘటిస్తూ ప్రజలు తీర్పునిచ్చేందుకు సిద్ధమయ్యారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు సీఎం కేసీఆరేనని దర్యాప్తు సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉన్నప్పటికీ మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటని, బీజేపీని ఎదురించే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు లేదని ఆయన విమర్శించారు. శుక్రవారం జోగిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. వేల కోట్ల రూపాయల దోపిడిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రం అండదండలు అవసరమని ఆయన ఆరోపించారు. 70 ఏండ్ల స్వాతంత్ర్య చరిత్రలో ఎన్నడూ చూడ‌ని విధంగా హుజురాబాద్ ప్రజ‌లు తీర్పునిచ్చార‌ని, డ‌బ్బు, మ‌ద్యం, అధికార దాహం అవేవి ఓట‌ర్లను ప్రభావితం చేయ‌లేవ‌ని నిరూపించ‌గ‌లిగార‌న్నారు.

హుజురాబాద్‌లో వ‌చ్చిన ఓట్లు బీజేపీకి వ‌చ్చిన‌వి కావ‌ని, కేసీఆర్ నిరంకుశ‌త్వ పాల‌న‌కు వ్యతిరేకంగా ప్రజ‌లు తీర్పునిచ్చార‌న్నారు. హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ప్రభుత్వం తరఫున సుమారుగా 5 వేల కోట్లు, 5 నుంచి 600 కోట్లు పార్టీ పరంగా ఖ‌ర్చుచేశార‌ని, నాలుగు మాసాల పాటు ప్రజ‌ల‌ను మ‌ద్యం, డ‌బ్బుల‌తో మ‌భ్యపెట్టినా స‌రైన తీర్చునిచ్చార‌న్నారు. హుజురాబాద్ ఫ‌లితాలు ప్రజ‌ల మ‌దిలో నుంచి మళ్లించ‌డానికే వ‌రిధాన్యంపై సీఎం కేసీఆర్ రాజ‌కీయం మొద‌లుపెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేక‌త ఉంద‌న‌డానికి హుజురాబాద్ ఫ‌లితాలే నిద‌ర్శన‌మ‌న్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డం ఖాయం

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నిక‌లు ముంద‌స్తు రావ‌డం ఖాయ‌మ‌ని మాజీ డీప్యూటీ సీఎం దామోద‌ర్ అన్నారు. కేసీఆర్ పాల‌న‌పై ఆయ‌నకే న‌మ్మకం లేకుండా పోయింద‌న్నారు. వ‌రి ధాన్యంపై రాజ‌కీయాలు చేస్తూ ప్రజ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే ప్రయ‌త్నంలో టీఆర్ ఎస్ ఉంద‌న్నారు. 12 నుంచి 14 మాసాల్లోగా సార్వత్రిక ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందని ఆయ‌న తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed