- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ధరణి' : రైతన్నకు తీవ్ర ఇక్కట్లు
దిశ, తెలంగాణ బ్యూరో: మూడేండ్ల కష్టం.. అధికారులు, మేధావులు, నిపుణులతో గంటలపాటు 150 సమావేశాలు వెరసి అత్యున్నతమైన ‘ధరణి’ పోర్టల్ ఏర్పడింది. ప్రపంచ దేశాలతోపాటు దేశంలోని మిగతా రాష్ట్రాలన్నిటికీ ఈ పోర్టల్ ఆచరణీయం అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ, రానున్న రోజుల్లో అదే ‘ధరణి’ నెత్తిమీద కుంపటిలా మారనుంది. అపరిష్కృత భూ సమస్యలతో పెద్ద చిక్కే వచ్చేటట్లుంది. రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటికీ సర్వరోగ నివారణి ‘ధరణి’గా పేర్కొన్నారు. కానీ, ఏ రికార్డు ఫైనల్ అని భరోసానివ్వలేదు. ఒక్క రోగాన్ని తగ్గించే అధికారం రెవెన్యూ అధికారుల చేతుల్లో లేదు. కొత్త ఆర్వోఆర్ చట్టంలో అధికారాలన్నింటినీ కోత పెట్టారు. పాత సమస్యలతోపాటు కొత్తగా వచ్చే వాటికి జవాబుదారీతనం లేదు. భూ సమస్యలొస్తే, వాటితో కష్టమొస్తే గోడు వినే నాథుడే లేని కొత్త ఆర్వోఆర్ వ్యవస్థ టీఆర్ఎస్ సర్కారుకు నష్టమే కలిగిస్తోందని రెవెన్యూ చట్టాల నిపుణుల అభిప్రాయం.
కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు మాత్రమే సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లారని, వాళ్ల సూచనలతో చేసిన ఈ కొత్త చట్టంతో కొత్త కష్టాలను తెచ్చిపెట్టనుందన్న ప్రచారం రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ధరణి, కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారా రైతులకు అదనంగా కలిగిన సౌకర్యలేమీ లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. అంతకు ముందు మాదిరిగానే పట్టాదారు పాసు పుస్తకాలు, 1-బి, పహాణీలు ఉన్నాయి. దానికి మించిన ప్రయోజనాలేమున్నాయో ఉన్నతాధికారులే చెప్పాలని రెవెన్యూ చట్టాల నిపుణులు, మాజీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు వేళ్లమీద లెక్కబెట్టేంత మంది కూడా రావడం లేదు. తప్పొప్పుల సవరణల కోసం వందల మంది వస్తున్నారంటూ ఉన్నతాధికారికి రెవెన్యూ ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. ఈ డేటాను సరి చేసుకునే వెసులుబాటు కల్పించకపోతే భౌతికదాడులు ఎదుర్కోకతప్పదంటూ ముందుగానే సమాచారమిచ్చారు. కనీసం మార్గదర్శకాలు జారీ చేస్తే సవరణ చేస్తామంటూ వేడుకున్నా..ఆ అధికారి మాత్రం ఇప్పుడే ఎందుకు? మరో 15 రోజులు ఆగండి. ఇప్పుడే కదా..‘ధరణి’ వచ్చిందంటూ దాటవేశారు. ఈ లోగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులపై దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
మిస్టేక్స్ కరెక్షన్స్‌కు నో..!
ఆదిలాబాద్ మండలం తాంసి మండలం కప్పర్ల, పడ్డాడి గ్రామాలకు చెందిన వాళ్లు కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల విస్తీర్ణంలో వ్యత్యాసం వచ్చింది. చాలా రోజులుగా కంప్యూటర్ తప్పిదంగా పేర్కొన్న సిబ్బందికి ఇప్పుడేమో సరిచేసే అవకాశం లేకుండా కొత్త చట్టం వచ్చేసింది. ఇప్పుడు వాళ్లు కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. రూ.లక్షలు విలువైన భూమి హక్కుల విషయంలో ఆక్రోశం పట్టుకోలేక తప్పు చేయని వీఆర్వో రోహిత్‌పై దాడికి దిగారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతానికి ప్రత్యక్షసాక్షికి కూడా న్యాయం జరగలేదు. వంశపారంపర్యంగా వచ్చిన భూమిని తొలగించారంటూ కవాడిపల్లికి చెందిన రైతు నారాయణ నేటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల భూమిని ఎందుకు తొలగించారో అధికారుల దగ్గర సమాధానం లేదు. తన కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు.
వేల సంఖ్యలో వివాదాలు..
ఈ రెండు ఉదంతాలే కాదు. వేల సంఖ్యలో వివాదాలు ఉన్నాయి. వీళ్లంతా సామాన్య రైతులే. చిన్నసన్నకారు రైతులే. అన్యాయాన్ని, నష్టాన్ని వినిపించుకునేందుకు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారులు వారి కష్టాన్ని, బాధను విని కూడా ఏం చేయలేని విధంగా కొత్త ఆర్వోఆర్ చట్టమొచ్చింది. న్యాయం చేయాలని ఉన్నా..పరిష్కరించేందుకు మార్గాలు లేకుండా ప్రభుత్వమే చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తప్పిదాలకు బాధ్యులెవరు?
భూరికార్డుల ప్రక్షాళనలో తలెత్తిన లోపాలను సవరించకుండానే అదే డేటాను ‘ధరణి’లో నమోదు చేశారు. కంప్యూటర్ తప్పిదాలు, ఆపరేటర్లు చేసిన పొరపాట్లు అనేకం అపరిష్కృతంగా ఉన్నాయి. పీఓబీ జాబితాలో పట్టాదారుల భూములను కూడా పేర్కొన్నారు. వాళ్లు చేసిన పొరపాట్లను కూడా సవరించుకునేందుకు కోర్టులను ఆశ్రయించాలన్న సమాధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారని ఓ డిప్యూటీ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కనీసం వారి రికార్డులన్నీ పరిశీలించి సరిదిద్దే వ్యవస్థ, అధికారం రెవెన్యూ అధికారులకు ఉండాలని సూచిస్తున్నారు. సామాన్య రైతులు పరిష్కారానికి కోర్టు దాకా వెళ్లే స్థాయి ఉండదని సీఎం కేసీఆర్ దృష్టికి ఎవరూ తీసుకెళ్లడం లేదు. అందుకే మార్గాలను మూసేశారన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి ఒకరిద్దరు ఆఫీసర్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలిసింది. ‘ధరణి’లో డేటా ఆధారంగా తలెత్తే వివాదాలకు పరిష్కారం మండల స్థాయిలో లభించేటట్లు ఉండాలని రెవెన్యూ యంత్రాంగం కోరుతోంది.
ధరణి.. అనుమానాలు..
⦁ సర్వరోగ నివారణి ‘ధరణి’. కానీ, ఏ సమస్యను పరిష్కరించే వ్యవస్థ లేదు.
⦁ ధరణిలో నమోదైన రికార్డు ఫైనల్ కాదు. ఆ డేటా ఫైనల్ అని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు.
⦁ సాదా బైనామాల క్రమబద్ధీకరణను కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎలా అమలు చేస్తారో అధికారులకే తెలియాలి.
⦁ ధరణి బ్రహ్మాండం. కానీ, క్షేత్ర స్థాయితో సంబంధం లేదు. రికార్డుల్లోని హద్దులకు, క్షేత్రస్థాయి హద్దులకు పోలికలే లేవు.
⦁ భూమి, వాటిని అనుభవిస్తున్న వారి కంటే కాగితాలకే విలువ దక్కింది.
⦁ రైతుబంధు పథకం అమలుకు పర్వాలేదు. కానీ, అదే డేటా ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే అనేక వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
⦁ ఇప్పటికీ ఆర్ఎస్ఆర్ విస్తీర్ణాల్లో అనేక తేడాలు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ 15 నుంచి 20 శాతం వరకు వివాదాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా రిజిస్ట్రేషన్లు కూడా కష్టమేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
⦁ ధరణి సేవల చార్జీలు సహేతుకంగా లేవన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
⦁ భూ సంస్కరణలను అందరూ స్వాగతిస్తున్నారు. కానీ, యజమానులకు కొత్తగా కలిగిన వెసులుబాట్లు, ప్రయోజనాలు ఏమీ లేవు. సమస్యల పరిష్కరించలేదు.
ఆ భూమి వారిదేనా?
‘ధరణి’ పోర్టల్ అత్యున్నతమైనదైతే ఎలాంటి వివాదాలు ఉండొద్దు. సీఎం కేసీఆర్ 99 శాతం వివాదాలు లేవన్నారు. ఏ ఒక్క గ్రామంలోనైనా రికార్డులు, క్షేత్ర స్థాయి పరిశీలన ఒకే మాదిరిగానే ఉందన్న గ్యారంటీ ఇవ్వగలరా? అని రెవెన్యూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్ అడిగారు. ఏ రైతు రికార్డుల్లో ఉన్నారు? నిశితంగా పరిశీలిస్తే ‘ధరణి’ డేటా ఎంత అత్యుత్తమైనదో బయటకొస్తుంది.
రైతన్నకు తీవ్ర ఇక్కట్లు..
కంప్యూటర్ చేసిన తప్పులు, ఉద్యోగులు చేసిన పొరపాట్లను సవరించేందుకు కూడా తహసీల్దార్లకు అవకాశాలు లేవు. పైగా రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. భూ విస్తీర్ణంలో వ్యత్యాసానికి, పేర్లలో తప్పిదాలకు కూడా సివిల్ కోర్టుల్లో తేల్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తులో చిన్న, సన్నకారు రైతాంగాన్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తహసీల్దార్ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ లేకపోయినా, పరిష్కారానికి అవకాశాలు లేకపోయినా కడుపు మండిన రైతులకు నష్టం వాటిల్లుతుంది. తన సొంత ఆస్తి తనది కాదన్న రికార్డులను ధిక్కరిస్తారు. తహసీల్దార్ ఆఫీసును కేవలం రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్లకే పరిమితం చేయడం ద్వారా చిన్న రైతులు కూడా ఇబ్బందులు పడతారు. భవిష్యత్తులో కార్యాలయానికి వచ్చిపోయే జనం ప్రతి పరిష్కారం సివిల్ కోర్టు అనే సమాధానం వినడం వల్ల తీవ్రమైన వ్యతిరేకత తలెత్తుందంటున్నారు.