మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన దళితులు.. ‘బండి’ రియాక్షన్ ఎంటీ..?

by Shyam |   ( Updated:2021-09-16 04:47:18.0  )
మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన దళితులు.. ‘బండి’ రియాక్షన్ ఎంటీ..?
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన సీనియర్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి దళితుల భూ కబ్జా వ్యవహరం తలనొప్పిగా మారింది. బీజేపీలో చేరిన తర్వాత పార్టీ అధినేత బండి సంజయ్ కామారెడ్డి జిల్లాలో మహా సంగ్రామ పాదయాత్ర చేపట్టగా అది ఎల్లారెడ్డి నియోజకవర్గం గుండా కొనసాగింది. అయితే, ఎర్రపహాడ్‌లో దళితులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్ర కొనసాగుతుండగా దళితులు ఎర్రపహాడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన పాదయాత్ర బీజేపీ వర్గాల్లో కలవరానికి గురి చేసింది. ముఖ్యంగా బీజేపీలో భవిష్యత్తును వెతుక్కుంటున్న ఏనుగు రవీందర్ రెడ్డికి ఈ వ్యవహరం మింగుడు పడడం లేదు. పట్టుబట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 65 కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహిస్తుండగా తన సొంత మండలం, గ్రామంలోని భూ కబ్జా వ్యవహరంపై దళితులు నిరసనకు దిగడం తలకు బొప్పికట్టినట్టు అయ్యింది.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామం. అక్కడ ఆయనకు వ్యవసాయ భూములున్నాయి. హైద్రాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేసే రవీందర్ రెడ్డి తన జాబ్‌కు రాజీనామా చేసి కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్‌లో చేరారు. 2004 నుంచి 2018 వరకు ఎల్లారెడ్డి నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామం సర్వే నెంబర్ 603, 608, 578, 585 ,606 పేద దళితులకు భూములు ఇచ్చారు. కానీ వాటిలో కొంత భాగాన్ని ఏనుగు రవీందర్ రెడ్డి ఆక్రమించారని దళితులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన 603 సర్వే నంబర్‌లోని ఫాంహౌజ్‌కు ఆనుకుని ఉన్న భూమిని కబ్జా చేశారని దళితులు ఆందోళన చేయడం కొత్త కాదు. గతంలో 2014-18 మధ్య దళిత సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు దళితులకు మద్దతుగా ఎర్రపహాడ్‌లో ఆందోళన చేశారు. వందరోజుల పాటు ఆందోళన చేసినా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారం మరుగునపడింది.

టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఎర్రపహాడ్‌లో భూముల కబ్జాల వ్యవహారం తేల్చేందుకు ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు గ్రామస్థులు. నాడు ఇంటెలిజెన్స్ అధికారులు ఏనుగు రవీందర్ రెడ్డి భూ కబ్జాపై సీఎం కార్యాలయానికి నివేదిక అందించారని విశ్వసనీయ సమాచారం. సీఎంవో ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సైతం రికార్డుల పరిశీలన చేసినట్లు తెలిసినా దానిని మాత్రం బహిర్గతం చేయలేదు. ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత సొంత నియోజకవర్గంలో భారీగా సమీకరణల మార్పుతో పాటు అగ్రనేతల పర్యటనల సమయంలో దళితులు ఆందోళనలు చేయడం ఆయన్ను ఇరుకున పెట్టేదిగా తయారైంది. దళితులు తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, తమ భూములను ఇప్పించాలని ఏకంగా ప్రభుత్వంపై , మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార పార్టీ ప్రమేయం లేదని దళితులు చెబుతుండగా కమలం పార్టీ నేతలకు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాదయాత్ర సమయంలోనే అది ఏనుగు రవీందర్ రెడ్డి తన ప్రాబల్యం చాటడానికి రాష్ట్ర అధ్యక్షుడితో సొంత నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడే దళితులు షాక్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ దళితులకు ఎలాంటి సమాధానం చెబుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story