అమెరికాకు ఊరట.. తగ్గుతోన్న కరోనా మరణాలు

by  |
అమెరికాకు ఊరట.. తగ్గుతోన్న కరోనా మరణాలు
X

కొవిడ్-19 వైరస్ ధాటికి అత్యంత ప్రాణ నష్టాన్ని చూసిన దేశం అమెరికా. కాస్త ఆలస్యంగానైనా మేలుకొని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అమెరికాలో రెండు రోజుల క్రితం వరకు భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ప్రతీ రోజు 2 వేల నుంచి 2700 మధ్య కరోనా బాధితులు మృతి చెందడం అక్కడి ప్రభుత్వాన్ని, ప్రజలను ఆందోళనలోకి నెట్టింది. కాగా, గడచిన 24 గంటలల్లో కరోనా వల్ల 1,738 మంది మృతి చెందినట్లు జాన్స్ హప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. బుధవారం మరణించిన 2,751తో పోల్చితే దాదాపు వెయ్యి మరణాలు తక్కువగా సంభవించాయి. గురువారం నాటికి అమెరికాలో 8,52,703 మంది కరోనా బారిన పడగా.. 47,750 మంది మృత్యువాతపడ్డారు. కాగా, గత కొన్ని రోజులుగా భారీగా నమోదవుతున్న కరోనా మరణాలు బుధ, గురువారాల్లో ఒక్క సారిగా తగ్గు ముఖం పట్టాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా బాధితులు, మరణాలను నమోదు చేసిన అమెరికాలో మరణాల రేటు తగ్గుతుండటం ఊరట కలిగించే విషయం. ఆ దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ ఎత్తేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. కాగా, జార్జియా రాష్ట్రంలో కరోనా సడలింపులు ఇస్తూ.. వాటిలో స్పాలు, బ్యూటీపార్లర్లు, హెయిర్ సెలూన్లు, టాటూ సెంటర్లకు అనుమతి ఇవ్వడంపై గవర్నర్ బ్రియాన్ కెంప్‌పై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్జియా గవర్నర్‌ తన మనసుకు నచ్చినట్లు చేయవచ్చు. కాని ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉందికదా..! ఈ నిర్ణయాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశానికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచే పరిశ్రమలు, సంస్థలు పని చేయడానికి అనుమతులు ఇవ్వాలి తప్ప స్పాలు, బ్యూటీపార్లర్లతో ఇప్పుడు పనేం ఉందని ట్రంప్ అన్నారు.

Tags: america, deaths, falling, relaxations, lockdown

Next Story

Most Viewed