24 గంటల్లో 37 మరణాలు.. 896 కేసులు : కేంద్రం

by  |

న్యూఢిల్లీ : భారత్‌లో ఒక్క రోజు వ్యవధిలో నమోదయ్యే కొత్త కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 37 మంది చనిపోయారనీ, కొత్తగా 896 కేసులు రిపోర్ట్ అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. మనదేశంలో ఒక్కరోజులో గరిష్టంగా 896 కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,761కి చేరింది. కాగా, కరోనా మరణాల సంఖ్య 206కు పెరిగింది.

దేశంలో కరోనా వ్యాప్తి వేగమవుతుండటంతో దాన్ని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, నిపుణులు కేంద్రాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. మనదేశంలో కరోనా వ్యాప్తి మూడో దశకు చేరిందా అనే అనుమానాలు వెల్లడవుతుండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని సమర్థించుకుంటూ ఓ రిపోర్టును విడుదల చేసి మళ్లీ వెనక్కి తీసుకుంది. కరోనా వ్యాప్తి ఇంకా క్లస్టర్ వ్యాప్తి దశలోనే ఉన్నదని, సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని వివరణ ఇచ్చింది.
tags: coronavirus, cases, deaths, india, surge, health ministry

Advertisement

Next Story

Most Viewed