Cyclone Yaas : తుఫాన్ కదలికల కోసం.. సైక్లోన్ ‘యాస్’ లైవ్ ట్రాకర్

by Anukaran |   ( Updated:2021-05-26 02:13:38.0  )
Cyclone Yaas : తుఫాన్ కదలికల కోసం.. సైక్లోన్ ‘యాస్’ లైవ్ ట్రాకర్
X

దిశ, ఫీచర్స్ : తీర ప్రాంతాల్లో రాకాసి తుఫాన్ ‘యాస్’ (Cyclone Yaas) అల్లకల్లోలం సృష్టిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రరూపం దాల్చడంతో ఒడిశా, బెంగాల్‌ తీరప్రాంతాల్లో అలలు విరుచుకుపడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని 9 జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇది అతి తీవ్ర తుఫాన్‌ కావడంతో గంటకు 130 నుంచి 140 కిలో మీటర్ల వేగంతో.. ఒక్కోసారి 155 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాళ్లు తెలిపారు. అయితే ‘యాస్’ తుఫాన్ ఎటు వైపుగా వెళుతుందో తెలుసుకునే వీలుందా? ముందుగానే దాన్ని గుర్తించి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చా? దీనికే సమాధానంగా ఇండియన్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సాఫ్ట్‌వేర్ & సొల్యూషన్స్ ప్రొవైడర్ ఈఎస్‌ఆర్ఐ(Esri) ఇండియా, ‘యాస్’ లైవ్ పాత్ తుఫానును అనుసరించడానికి ఒక మ్యాప్‌ను రూపొందించింది. తుఫానును ట్రాక్ చేయడానికి మీరు దీన్ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

‘యాస్’ తుఫాను భారతదేశం తూర్పు తీరంలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే తుఫాను వేళ అప్రమత్తంగా ఉండటం ఎంత ముఖ్యమో, అలాగే తుఫాను మార్గం, ఇతర పరిణామాలపై తాజా సమాచారంతో సిద్ధంగా ఉండటం కూడా అంతే ప్రధానం. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ఎలా కదులుతోందో నేరుగా మనం కూడా చూసే విధంగా ఈఎస్ఆర్ఐ ఇండియా ఓ మ్యాప్ రూపొందించింది.

తుఫాన్ కదలిక, తుఫాన్ వస్తున్న వేగం, వీస్తున్న గాలుల వేగంతోపాటు ఏ ప్రాంతంలో అధిక ప్రభావం చూపిస్తోందో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు గృహాల సంఖ్య, ప్రభావిత ప్రాంతంలో జనాభా ఎంత ఉందో వివరిస్తుంది. ఈ మ్యాప్ ఆర్క్‌జిస్ ఆన్‌లైన్, ఎస్రి మ్యాపింగ్, అనలిటిక్స్ సిస్టమ్‌తో రూపొందించారు. IMD (ఇండియన్ మెటీరోలాజికల్ డిపార్ట్‌మెంట్) నుంచి ఇన్‌పుట్‌లను ఉపయోగించి తుఫాను సంబంధిత అంశాలపై నవీకరణలను అందిస్తుంది. అధికారుల ఫీడ్ కూడా ఇక్కడ పొందవచ్చు. మూలాల నుంచి సమాచారాన్ని మ్యాప్ ఏకీకృతం చేస్తోంది.

ట్రాకింగ్ :

యూజర్లు సైక్లోన్ ‘యాస్’ ఈఎస్ఆర్ఐ ఇండియా జిఐఎస్ మ్యాప్‌తో బ్రౌజర్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. దీని ద్వారా ప్రత్యేకమైన సైక్లోన్ యాస్ లైవ్ పాత్ పేజీకి వెళ్లడం ద్వారా ట్రాక్ చేయవచ్చు. వినియోగదారులందరూ తుఫానును ట్రాక్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. పేజీ డెస్క్‌టాప్ బ్రౌజర్‌లతో పాటు ఫోన్‌లలో ‘తుఫాను’ కదలికలను సరిగ్గా అమలు చేయడానికి ఆప్టిమైజ్ చేశారు. మ్యాప్‌లోకి జూమ్ చేయడం ద్వారా వినియోగదారులు ప్రభావిత ప్రాంతాలపై సంబంధిత సమాచారాన్ని పొందుతారు. ఇందులో ఆశ్రయం ఉన్న ప్రదేశాలు, వాతావరణం, విండ్ స్టేషన్ డేటా ఉంటుంది. అంతేకాదు రంగుల్లో ఉపగ్రహ చిత్రాలు కూడా ఉన్నాయి.

‘పౌరులకు, సంబంధిత అధికారులు, విభాగాలు, సామాజిక సంస్థలకు ఎప్పటికప్పుడు తుఫాను సమాచారం చేరువయ్యేలా చేయడమే దీని లక్ష్యం. ఈ సమాచార సాయంతో జీవితంతో పాటు, ఆస్తి భద్రత కోసం సకాలంలో చర్యలు తీసుకోవచ్చు. ముందుగానే ఇంటికి కావాల్సిన సామాగ్రి తెచ్చుకోవచ్చు. అప్రమత్తంగా ఉండొచ్చు. అందుకోసమే సైక్లోన్ యాస్ లైవ్ పాత్ మ్యాప్ ప్రత్యేకంగా రూపొందించాం’
– అజెంద్ర కుమార్, ఎస్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్

Click Below Link :

https://esriindia.maps.arcgis.com/apps/webappviewer/index.html?id=845bd03d857b43789d712dee96f056ce

Advertisement

Next Story

Most Viewed