మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష: సీపీ

by Sumithra |
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష: సీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారు టెర్రరిస్టులతో సమానమన్న సీపీ.. తాగి బండి నడిపేవాళ్లను ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించామని, వారం పాటు సైబరాబాద్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతామని పేర్కొన్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్వోటీ పోలీసులు కూడా డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో పాల్గొంటారని సీపీ వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే నగరంలో 420మంది మద్యం తాగి బండి నడిపినవారు పట్టుబడ్డారని తెలిపారు.

సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ వార్షిక నేర గ‌ణాంకాల‌ను సీపీ స‌జ్జ‌నార్ సోమవారం విడుదల చేసి మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6.65శాతం నేరాలు తగ్గాయని తెలిపారు. రోడ్డుప్రమాదాలు 22.7శాతం, మహిళలపై నేరాలు 18.6శాతం, చిన్నారులపై 12.2శాతం నేరాలు తగ్గాయని పేర్కొన్నారు.. సైబర్ నేరాలు 135శాతం పెరిగితే.. హత్యలు, దోపిడీలు 26శాతం తగ్గాయని, హత్యాయత్నం కేసులు 30శాతం, అత్యాచారం కేసులు 33శాతం తగ్గినట్లు వెల్లడించారు. ఆర్థిక నేరాలు 42శాతం పెరిగినట్లు వివరించారు.

Advertisement

Next Story