పట్నం నుంచి పల్లెలోకి ‘కరోనా’

by Shyam |
పట్నం నుంచి పల్లెలోకి ‘కరోనా’
X

దిశ, నల్లగొండ : కొద్దిపాటి నిర్లక్ష్యం ఆ జిల్లాను అతలాకుతం చేస్తోంది. ఓ వైపు దేశమంతా నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి భయానికి వణికిపోతే జిల్లాలో మాత్రం ఈజీగా తీసుకున్నారు. ఎక్కడో వైరస్ వస్తుంది.. మన దగ్గరికి రాదులే అన్న నిర్లక్ష్యమే రాష్ట్రంలోనే కరోనా పాజిటివ్ కేసుల్లో రెండోస్థానంలో నిలబెట్టంది. ఆ జిల్లానే సూర్యాపేట. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు. కానీ, ఆ తర్వాత జిల్లాలో కేసుల నమోదు సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు జిల్లాలో 80 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటి దాకా సూర్యాపేట పట్టణానికే పరిమితమైన కొవిడ్ కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు (పల్లెల్లోకి) విస్తరించాయి.

లాక్‌డౌన్ ఉల్లంఘన..

లాక్‌డౌన్‌ వేళలోనూ సూర్యాపేటలో ప్రజలు యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించారు. మార్కెట్‌లో కూరగాయలు తెచ్చుకోవడం దగ్గరి నుంచి విందులు, వినోదాలకు హాజరవడం వరకు అన్నింటిలోనూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో జిల్లాలో భారీగా కేసులు నమోదవుతున్నాయనే విమర్శలున్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంత జనాభా అధికం. ఏ చిన్నపనికైనా పేటకు వెళ్దాం అన్న ఆలోచనలో ప్రజలు ఉంటారు. దాన్ని నిలువరించి కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదని పలువురు అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ఒకే వ్యక్తి నుంచి 38 మందికిపైగా కేసులు నమోదయ్యాయి. ఇదీ ఇంతటితో ఆగేలా కన్పించడం లేదు. డీఎంహెచ్‌వో పై వేటు..

జిల్లాలో మొదటగా సూర్యాపేట పట్టణంలోని కుడకుడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆ తర్వాత ఓ మెడికల్ దుకాణం యాజమానికి సోకింది. ఇలా ఒక్క సూర్యాపేట పట్టణంలో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆత్మకూర్(ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామంలో 15 కేసులు నమోదయ్యాయి. తిరుమలగిరిలో 6 కేసులు, నాగారం మండలంలో 6 కేసులు, మద్దిరాల మండలం పోలుమల్లులో ఒకటి, నేరేడుచర్లలో ఒక కేసు నమోదయ్యాయి. మొత్తంగా సూర్యాపేట పట్టణంలో 51 కేసులు నమోదైతే.. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 29 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సూర్యాపేట డీఎంహెచ్‌వోపై ఉన్నతాధికారులు వేటు వేసి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి లాక్‌డౌన్ సక్రమంగా అమలు చేయడంలో విఫలమైన మరో ఇద్దరు ముగ్గురు అధికారులపై వేటు పడాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

క్వారంటైన్ కేంద్రాల్లోనూ అవస్థలు..

సూర్యాపేట జిల్లాకు అనుకుని ఉన్న దురాజ్‌పల్లి మైనార్టీ స్కూల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలో సమస్యలు ఉన్నాయి. సమయానికి తిండి పెట్టడం దగ్గరి నుంచి కనీస భద్రత చర్యలు పాటించేందుకు శానిటైజర్లు, మాస్కులు ఇవ్వని దుస్థితి నెలకొంది. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని
తీసుకొచ్చి క్వారంటైన్ కేంద్రాల్లో వేయడం తప్ప వారి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో క్వారంటైన్ కేంద్రంలోని అసౌకర్యాలపై అందులోనే ఉన్న ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అదీకాస్త వైరల్‌గా మారి మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో మంత్రి వెంటనే క్వారంటైన్
కేంద్రంలోని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.

కలెక్టర్, ఎస్పీ, వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించారు. జిల్లా కేంద్రాన్నిరెడ్ జోన్‌గా ప్రకటించారు. నిత్యావసరాల కోసం ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా ఇంటింటికే కూరగాయలను పంపిణీ చేస్తున్నారు. సూర్యాపేటపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాకు కొత్త డీఎంహెచ్ఓను నియమించడంతో పాటుగా సూర్యాపేట డీఎస్పీని సైతం మార్చారు. జిల్లాలో పరిస్థితిని సమీక్షించేందుకు ఇవాళ (బుధవారం) రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు జిల్లాలో ప్రత్యేకంగా పర్యటించారు. లాక్ డౌన్ పకడ్బందీ అమలుకు అధికారులకు సూచనలు చేశారు.

Tags: covid 19 cases, increasing, suryapet, cs, someshkumar, visit, lock down, violation

Advertisement

Next Story

Most Viewed