విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలి: సీఎస్ సోమేశ్‌కుమార్

by Shyam |
విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలి: సీఎస్ సోమేశ్‌కుమార్
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో కరోనాను త్వరలో కట్టడి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన సూర్యాపేటకు వెళ్లారు. సీఎస్ వెంట డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి, కార్యదర్శి శ్రీనివాస్ కూడా ఉన్నారు. జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. ఆ తర్వాత కంటైన్‌మెంట్ ఏరియాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎస్, డీజీపీ ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకుంటున్న చర్యలపై వైద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. త్వరలోనే జిల్లాలో పరిస్థితులు చక్కబడతాయన్నారు. సూర్యాపేటలో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించారు. ఇకపై కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. కంటైన్‌మెంట్ ఏరియాల్లో జనసంచారాన్ని పూర్తిగా నిషేధించడంతోపాటు ప్రత్యేక మెడిసిన్ అందించాలని వైద్యాధికారులను ఆదేశించామన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైమరీ కాంటాక్ట్స్ అన్నింటిని ఇప్పటికే గుర్తించి తగిన చర్యలు చేపట్టామన్నారు. అన్ని శాఖలతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న సందర్భంలో వారిని అభినందించారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారికి అవసరమైన వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు.

Tags: corona, containment areas, cs somesh kumar, nalgonda, dgp mahender reddy

Advertisement

Next Story