సీఎస్​గారూ.. టైం ఇస్తారా? కోర్టుకు వెళ్లమంటారా?

by Shyam |   ( Updated:2021-08-05 06:55:50.0  )
cs somesh kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేం ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న కొత్త నిబంధనల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ధరణి పోర్టల్‌లో 17 రకాల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. భూములు అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్​ దృష్టికి తీసుకొచ్చేందుకు ఏడాదిగా ప్రయత్నిస్తున్నాం. కానీ అపాయింట్మెంట్​ కూడా ఇవ్వడం లేదని తెలంగాణ రియల్టర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు. తమ బాధలు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించకపోవడాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిలిపివేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని డిమాండ్​ చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని, ఎల్ఆర్ఎస్​ చార్జీలు పెరగడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలు ఇండ్లు కట్టుకోవడం అసాధ్యంగా మారిందన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలను 7.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని, ఎల్ఆర్ఎస్ ​పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. అలాగే ఫాం సైట్లలో కూడా 200 గజాలు కొనుక్కోకుండా చేశారని మండిపడ్డారు.

40 సార్లు వినతి

రియల్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నారగోని ప్రవీణ్ కుమార్ ​40 సార్లు ప్రయత్నించారు. సీఎస్‌కు అన్ని వివరించాలన్న ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం కూడా సీఎస్ ​కార్యాలయానికి ఫోన్​ చేసి అపాయింట్మెంట్​ ఇప్పించాలని వేడుకున్నారు. ఏడాది కాలంగా ఇలా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానన్న విషయాన్ని ఆయన వివరించారు. ఏయే సమస్యల పరిష్కారం కోసం టైం అడుగుతున్నారో కూడా వివరించారు. అధికారులు మాత్రం మీ దరఖాస్తును మెయిల్​ ద్వారా సీఎస్‌కు సమర్పించాలని సూచించారు. అలాంటి ప్రక్రియలు కూడా ఎన్నోసార్లు చేసినట్లు గుర్తు చేశారు.

మరోసారి అపాయింట్మెంట్ ​కోసం మెయిల్ ​ద్వారా అప్లికేషన్ ​పంపాలని ఉచిత సలహా ఇచ్చారు. కార్యాలయం సూచన మేరకు గురువారం 10 మంది అసోసియేషన్ ​సభ్యులు అపాయింట్మెంట్​ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెయిల్ ​చేశారు. ఇప్పటికైనా ఆయన సమయం ఇస్తారా, ఇవ్వరా? అని వేచి చూస్తున్నట్లు ప్రవీణ్​కుమార్ ​తెలిపారు. ఇకపై సీఎస్ ​అపాయింట్మెంట్​ కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed