క్రాస్ ఓటింగ్ కలవరం.. ఓట్లను కాపాడుకోలేకపోయిన అధికార పార్టీ?

by Shyam |   ( Updated:2021-12-14 11:39:59.0  )
kcr-tension-1
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కొన్ని జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ ను మాత్రం అడ్డుకోలేకపోయింది. క్యాంపు రాజకీయాలు చేపట్టారు. అయినప్పటికీ ఇండిపెండెంట్, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా మినహా మెదక్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు లెక్కల్లో స్పష్టమైంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో క్రాస్ ఓటింగ్ కలవరం మొదలైంది. స్థానిక సంస్థల సభ్యులంతా ఓట్లు వేయకపోవడంతో ఎవరూ వేయలేదనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. 15 నుంచి 20 రోజులు క్యాంపులకు తీసుకెళ్లినప్పటికీ ఇతరులకు ఓటు వేసినట్లు స్పష్టమైంది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి 497 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కు 116 ఓట్లు, టీడీపీ-19, సీపీఐ-34, సీపీఎం-26, న్యూ డెమోక్రసీ -15, స్వతంత్రులు-60 మంది ఉండగా పలువురు టీఆర్ఎస్ లో చేరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ కు 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 242 ఓట్లు వచ్చాయి. సుమారు 126ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వర్ రావుకు వచ్చాయి. ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐతో కలిసి టీఆర్ఎస్ పోటీ చేసింది. వారి మద్దతు ఉంది. అయినప్పటికీ టీఆర్ఎస్ వైపు ఉన్నవారు సైతం సొంత అభ్యర్థికి ఓటు వేయలేదని పార్టీ నేతలే ఆరోపించారు.

కరీంనగర్ లో మొత్తం1324 ఓట్లు ఉండగా 986 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవి. అయితే టీఆర్ఎస్ కు చెందిన భాను ప్రసాద్ కు 585, ఎల్. రమణకు 479 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇద్దరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఇద్దరి ఓట్లు కలిపితే 1064 ఓట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ కు సైతం 231 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కు 90, బీజేపీకి 30, ఇతరులు 218 మంది ఉన్నారు. పోలైన ఓట్లలో 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. రవీందర్ సింగ్ కు 231 ఓట్లు వేసినవారు ఇతర పార్టీలకు చెందినవారా? లేకుంటే టీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ జరిగిందా అని మాత్రం అంతుచిక్కడం లేదు.

నల్లగొండలో టీఆర్ఎస్ కు 971 ఓట్లు ఉండగా 917 ఓట్లు వచ్చాయి. అంటే సుమారు 54 ఓట్లు అధికార పార్టీకి పడలేదని స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా పోలింగ్ మరో రెండ్రోజులు ఉండగా కొంతమంది ఎంపీటీసీలు టీఆర్ఎస్ లో చేరారు. అయినప్పటికీ అధికారపార్టీకి చెందిన స్థానిక సంస్థల సభ్యులు పూర్తి స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోలేదా? లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి వేశారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి 554 ఓట్లు, ఉండగా 742ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీలకు చెందిన వారు సైతం టీఆర్ఎస్ కు ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ కు 180, బీజేపీ 69, ఎంఐఎం 22, స్వతంత్రులు 87, సీపీఐ 3 ఉన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థికి మాత్రం 75 ఓట్లు మాత్రమే వచ్చాయి.

మెదక్ లో టీఆర్ఎస్ కు 777 ఓట్లు ఉండగా 762 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు తగ్గాయి. అంటే సభ్యులు చెల్లని ఓట్లు వేశారా? లేకుంటే ఓటు వినియోగించుకోలేదా అనేది సందిగ్ధంగా మారింది. జిల్లాలో బీజేపీకి 20 ఓట్లు, కాంగ్రెస్ కు 230 ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 8 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇవి బీజేపీకి చెందిన ఓట్లా? టీఆర్ఎస్ కు చెందిన వారు వేశారా? అనేదానిపై అయోమయం నెలకొంది.

Advertisement

Next Story