పెంచడమెందుకు? నరకడమెందుకు?

by Sridhar Babu |   ( Updated:2021-11-20 00:24:51.0  )
పెంచడమెందుకు? నరకడమెందుకు?
X

దిశ, భద్రాచలం (చర్ల): మానవాళి మనుగడ, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా విరివిగా మొక్కలునాటి చెట్లుగా పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి హరితహారం పథకం అమలు చేస్తోంది. రహదారుల ప్రక్కన చెట్లు పెంచడం వలన బాటసారులకు నీడ, చూడటానికి ముచ్చటగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా మొక్కలు నాటడం జరిగింది. చర్లలో దాతలు చందాలు వేసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రీన్‌చర్ల ప్రోగ్రాం క్రింద అన్ని వీధుల్లో పెద్ద సంఖ్యలో చెట్లు నాటారు. అలా నాటిన చెట్లు ఏపుగా పెరుగుతుంటే కరెంట్ తీగలకు అడ్డు వస్తున్నాయని ఎప్పటికప్పుడు విద్యుత్‌ శాఖ అధికారులు దగ్గర ఉండి చెట్ల కొమ్మలు నరికించి మొక్కల ఎదుగుదలను అడ్డుకుంటున్నారు.

ఇలా చెట్లు ఎదగకుండా చీటికిమాటికి కొమ్మలు నరుకుతుంటే ఇక చెట్లు నాటి ఉపయోగం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్ వలన ప్రజాధనం దుర్వినియోగమే కదా అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏపుగా ఎదిగి చూడముచ్చటగా ఉన్న చెట్లను నరుకుతుంటే వృక్ష ప్రేమికులు బాధపడుతున్నారు. ఆదివారం చర్లలో జరిగే వారపుసంతకు వేలాదిగా తరలివచ్చే ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలకు నీడ కరువౌతోంది. ఎదిగితే అడ్డుగా వస్తాయనుకున్నచోట ముందుచూపు లేకుండా మొక్కలు నాటడం ఎందుకు? పెరిగిన చెట్లు నరకడం ఎందుకు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకి అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కార మార్గం కనుగొనాలని చర్ల గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story