దీదీ వర్సెస్ మోడీ.. తారాస్థాయికి చేరుకున్న మాటల యుద్ధం

by Shamantha N |
దీదీ వర్సెస్ మోడీ.. తారాస్థాయికి చేరుకున్న మాటల యుద్ధం
X

కోల్‌కతా: రసవత్తరంగా సాగుతున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, టీఎంసీ అగ్ర నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. ఓడిపోతాననే నైరాశ్యంతోనే దీదీ తనను దూషిస్తుందని మోడీ అంటే.. ఆయన ఓ అబద్దాల కోరు అని బెనర్జీ ఆరోపిస్తున్నారు. బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా వీరిరువురు పలు చోట్ల జరిగిన ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు.

కూచ్‌బెహర్‌, హౌరాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. దీదీకి తన ఓటమి ఖరారైందని తెలిసిందని, ఓటమి నైరాశ్యంతోనే ఆమె తనపై విద్వేషాన్ని వెల్లగక్కుతున్నారని అన్నారు. ‘నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో నువ్వు గేమ్‌ ఆడినప్పుడే ఓడిపోయావ్. అదే రోజు నువ్వు ఓటమి పాలయ్యావని దేశ ప్రజలకు అర్థమైంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో దీదీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని విమర్శించారు. ముస్లిముల ఓట్లను దీదీ అభ్యర్థించడాన్ని బట్టి చూస్తే ఆ వర్గం ప్రజలు కూడా ఆమెకు దూరమవుతున్నారని, ఈ విషయాలే దీదీ ఓడిపోతున్నాయని స్పష్టం చేస్తున్నాయని మోడీ వ్యాఖ్యానించారు.

ఇక అలిపుర్దార్ జిల్లాలోని ఎన్నికల సభలో పాల్గొన్న దీదీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం కేంద్ర బలగాలను దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో యూనిఫాం వేసుకున్న వ్యక్తులు బీజేపీకి సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మోడీ ఒక అబద్దాల కోరు అని విరుచుకుపడ్డారు. ఆయన పాల్గొనే ప్రతి సభలోనూ తనపై నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీఎంసీ కార్యకర్తలు, అభ్యర్థులపై బీజేపీ దాడులకు పాల్పడుతున్నదని.. వీటిపై ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు శూణ్యమని అన్నారు. బెంగాల్‌ను అదుపులోకి తీసుకోవాలనుకున్న వారి ప్రయత్నాలు ఫలించబోవని దీదీ మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed