- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ ఊరికి ఏమైంది.. ఒకరి దశదిన కర్మ పూర్తికాకముందే మరొకరు మృతి

దిశ, జమ్మికుంట : వరుసగా వివిధ కారణాలతో 2 నెలల కాలంలో 13 మంది మృత్యువాత పడగా గ్రామానికి కీడు సోకిందని భావించిన గ్రామస్తులు ఊరు విడిచి వెళ్లిపోయారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. విలాసాగర్ గ్రామానికి చెందిన చిన్నాపెద్దా అందరూ సూర్యోదయానికి ముందే ఇండ్లకు తాళాలు వేసి గ్రామ సమీపంలోని మానేరు పరీవాహక ప్రాంతానికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఊరంతా ఖాళీ అయింది. ఆ గ్రామంలో రెండు నెలల వ్యవధిలో 13 మంది వివిధ కారణాలతో మృతి చెందారు.
కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరి కొందరు రోడ్డు ప్రమాదంలో, ఇంకొందరు అనారోగ్యంతో మృతి చెందారు. ఒకరి దశదినకర్మ ముగియకముందే మరొకరు మృత్యువాత పడడంతో గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కారణాలు ఏమైనా మరణాలు ఆగకపోవడంతో దీనిపై గ్రామ పెద్దలు, వేద పండితులు చర్చించుకుని ఊరు బాగుండాలంటే పొయ్యి వెలిగించక ముందే, సూర్యోదయానికి ముందే గ్రామం నుంచి వెళ్లడమే శ్రేయస్కరమని భావించారు. ఊరంతా ఏకమై కీడు వంటలు చేసుకునేందుకు వెళ్లారు. గ్రామానికి సోకిన కీడు పోయి, మృత్యు ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఒక రోజంతా గ్రామం మొత్తం కీడువంటలకు వెళ్తేనే మంచి జరుగుతుందని భావించారు. దాంతో గ్రామస్తులంతా ఊరు విడిచి వెళ్లారు.