Ragging : కాలేజీల్లో అకృత్య క్రీడ.. జూనియర్ల ప్రాణాలు తీస్తున్న ర్యాగింగ్

by Bhoopathi Nagaiah |
Ragging : కాలేజీల్లో అకృత్య క్రీడ.. జూనియర్ల ప్రాణాలు తీస్తున్న ర్యాగింగ్
X

ర్యాగింగ్ తీవ్రమైన అంశం. దీనిపై చట్టాలు మారుతున్నాయి. శిక్షలూ పడుతున్నాయి. కానీ విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడంలేదు. ఈ వికృత చర్యలు మాత్రం ఆగడం లేదు. అనేక కాలేజీల్లో ఈ భూతం స్టూడెంట్స్‌ను వెంటాడుతూనే ఉన్నది. సీనియర్లు.. జూనియర్లను వేధించడం, శిక్షలు వేయడం, హేళన చేయడం, వివిధ రకాల పనులు అప్పగించడం వంటి అనేక ఘటనలూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొన్ని ఘటనలు బయట పడగా.. ఇంకొన్ని ఘటనలు అక్కడికక్కడే మ్యానేజ్ చేసేస్తున్నారు. ర్యాగింగ్ చేస్తున్న వారు పట్టుబడి.. వారికి శిక్షలు పడుతున్నా.. ఈ చర్యలు మాత్రం ఆగడం లేదు. - నిసార్

CASE STUDY 1

ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హెయిర్ స్టైల్ విషయంలో అతడిని సీనియర్లు హెచ్చరించారు. వారు చెప్పినవిధంగా ఆ విద్యార్థి ట్రిమ్మింగ్ చేయించుకుని కళాశాలకు వచ్చాడు. ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్(Ragging) ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్.. ఆ స్టూడెంట్ కటింగ్ బాగా లేదని సెలూన్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఆ విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ప్రిన్సిపాల్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్‌ను ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించారు.

CASE STUDY 2

నల్లగొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్‌కు పాల్పడ్డారని.. జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ నలుగురిని బాధ్యులుగా పేర్కొంటూ.. జిల్లా కలెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. దీంతో ఆ నలుగురిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు.

CASE STUDY 3

గుజరాత్‌లోని పఠాన్ జిల్లా ధార్పూర్‌లో జీఎంఈఆర్‌ఎ‌స్ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న అనిల్ అనే విద్యార్థి మరణించాడు. సీనియర్లు అతడిని మూడు గంటల పాటు నిలబెట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు.

CASE STUDY 4

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ర్యాగింగ్‌లో భాగంగా యువకుడిని నగ్నంగా ఊరేగించారని, దానిని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏటేటా పెరుగుతున్న ఫిర్యాదులు

దేశంలో సుమారు 60 శాతం విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడుతున్నారని 2015లో జేఎన్‌యూ చేపట్టిన అధ్యయనంలో తేలింది. 2017లో నిర్వహించిన మరో సర్వేలో 40 శాతం విద్యార్థులు ఏదో ఒకరమైన ర్యాగింగ్ బారిన పడుతున్నారని వెల్లడయ్యింది. ఇందులో ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. యూజీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌లో 2021-22 విద్యా సంవత్సరంలో 582 కేసులు, 2022-23లో 858, 2023-24లో 1240 ఫిర్యాదులు అందాయి.

యూజీసీ ఏం చెబుతోంది?

1970లోనే కేంద్ర ప్రభుత్వం ర్యాగింగ్‌ను నిషేధించింది. 1997లో ఉమ్మడి రాష్ట్రంలో దీనికి సంబంధించిన చట్టం తెచ్చారు. అయినా ఎక్కడా ర్యాగింగ్ ఆగలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ర్యాగింగ్ నిరోధానికి యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతికంగానే కాదు, మానసికంగా వేధించినా ర్యాగింగ్ కిందికే వస్తుందని సవరణ తెచ్చింది. విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు ఏటా ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నది. ర్యాగింగ్ ఘటన బయటపడగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. నిందితులను హాస్టల్/విద్యాసంస్థ నుంచి బహిష్కరించొచ్చు. నేరం రుజువైతే ఆరు నెలల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తారు.

విద్యార్థులపై సినిమా ప్రభావాలు?

ర్యాగింగ్‌కు సినిమా వ్యామోహం కూడా ప్రభావం చూపుతుందని పలువురు చెబుతున్నారు. సీనియర్ విద్యార్థులను హీరోలుగా చూపుతూ కొన్ని సినిమాల్లో ర్యాగింగ్ ఘటనలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఘటనలు సైతం లేకపోలేదని పలువురు చెబుతున్నారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రదేశాల నుంచి చదువుకునేందుకు వస్తున్న యూనివర్సిటీలు, కాలేజీలు ప్రధానంగా మెడికల్, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ఈ ర్యాగింగ్ భూతం వీడడం లేదు.

ర్యాగింగ్ చేస్తే తీసుకునే చర్యలు

  • తరగతులకు హాజరుకాకుండా సస్పెన్షన్ చేయొచ్చు.
  • ఏదైనా పరీక్ష లేదా ఇతర మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనకుండా డిబార్ చేయొచ్చు.
  • ఫలితాలను నిలపి వేయొచ్చు.
  • ఏదైనా ప్రాంతీయ, జాతీయ లేదా అంతర్జాతీయ మీట్, టోర్నమెంట్ యూత్ ఫెస్టివల్ మొదలైన వాటిలో సంస్థకు ప్రాతినిధ్యం వహించకుండా డిబార్ చేయడం.
  • హాస్టల్ నుంచి సస్పెన్షన్/బహిష్కరణ
  • అడ్మిషన్ రద్దు
  • ఒకటి నుంచి నాలుగు సెమిస్టర్ల వరకు సంస్థ నుండి రెస్టికేషన్
  • సంస్థ నుంచి బహిష్కరణ మరియు నిర్ణీత వ్యవధిలో ఏదైనా ఇతర సంస్థలో ప్రవేశం నుంచి డిబార్ చేయొచ్చు.
  • కోర్సు పూర్తి అయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్/మైగ్రేటరీ సర్టిఫికేట్‌లో ర్యాగింగ్‌కు సంబంధించిన రిమార్క్‌లు ఉంటాయి.

ర్యాగింగ్ చరిత్ర

యూరప్ దేశాల్లోని యూనివర్సిటీల్లో కాలేజీకి కొత్తగా వచ్చే విద్యార్థులకు అక్కడి వాతావరణం అలవాటు చేసేందుకు సీనియర్లు వారితో సరదాగా ఆటపట్టించేవారు. దానివల్ల వారిలో ఒత్తిడి తగ్గి స్నేహితులతో కలిసిపోవడంతోపాటు చదువు విషయంలో సీనియర్లనుంచి సలహాలు తీసుకునేందుకు వీలుగా ఉండేది. అదే సంస్కృతి ఇక్కడికి వచ్చింది. కానీ, అది అవసరానికి మించి విశృంఖలంగా మారడం.. విద్యార్థులు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి రావడంతో ప్రభుత్వాలు, కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

  1. 1997లో తమిళనాడు ప్రభుత్వం ర్యాగింగ్ ను నిషేధించింది. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా చట్టం చేసిన తొలి రాష్ట్రం.
  2. 1983లోనే కర్ణాటక కూడా ర్యాగింగ్ కు వ్యతిరేకంగా చట్టాలు చేసింది. అయితే, అది ఎడ్యుకేషన్ యాక్ట్ లో భాగంగా పలు అంశాలు పేర్కొన్నది. 1995లో కూడా ఆ చట్టాన్ని మాడిఫై కూడా చేసింది. కానీ, ర్యాగింగ్ పేరుతో నిరోధక చట్టం చేసిన ఘనత తమిళనాడు సొంతం చేసుకున్నది. త్రిపుర 1990లో విద్యాసంస్థల చట్టంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది.
  3. 1997లో యాంటీ ర్యాంగింగ్ చట్టాన్ని తమిళనాడు తర్వాత అదే ఏడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అమల్లోకి తెచ్చింది.
  4. 2001లో సుప్రీంకోర్టు ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని యూజీసీ, కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విశ్వజాగ‌తి మిషన్ దాఖలు చేసిన పిల్ పై ఈ మేరకు తీర్పు జారీ చేసింది.
  5. 2009లో ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది.
  6. 2011లో కేంద్రం ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది. కాలేజీలో ఎవరైనా విద్యార్థిని అవహేళన చేయడం, శారీరక హానితోపాటు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించేలా చేస్తే వారిని చట్ట ప్రకారం శిక్ష విధించవచ్చు. కేరళ ప్రభుత్వం 1998లో తీసుకువచ్చిన ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం.. ఈ కేసులో నేరం నిరూపణ అయితే, రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించవచ్చు.

కాలేజీలో అందరూ సమానమే

కాలేజీల వాతావరణం స్చేచ్ఛాయుతంగా ఉండాలి. ఇందులో అందరూ సమానులే. కొన్ని చోట్ల సీనియర్లు.. జూనియర్లను ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నట్టు చూస్తున్నాం. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్న కొత్త విద్యార్థుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని వారి పిల్లలను కాలేజీలకు పంపిస్తున్నారు. ఇలా వచ్చిన వారిని ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెడితే.. వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ర్యాగింగ్ అనేది ఓ క్రూరమైన చర్య. ఇలా చేసే అర్హత ఎవరికీ లేదు. ర్యాగింగ్ అనే పెను భూతాన్ని పక్కన పెట్టుకొని మంచి సమాజాన్ని నిర్మించలేం. దీనిపై ముందు నుంచే అవేర్ నెస్ కల్గించాలి. ఈ భూతానికి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వికృత చేష్టలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చొద్దు. ర్యాగింగ్ జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలతో పాటు కాలేజీల యాజమాన్యాలపైనా ఉన్నది.

-యాకుబ్, మాజీ ప్రిన్సిపాల్, ముంతాజ్ కాలేజ్, హైదరాబాద్

Advertisement

Next Story

Most Viewed