పుణ్య స్నానాలకు వెళ్లి పరలోకానికి ..రెప్పపాటులో విషాదం

by Aamani |
పుణ్య స్నానాలకు వెళ్లి పరలోకానికి ..రెప్పపాటులో విషాదం
X

దిశ, వెల్గటూర్ : ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మునిగిపోయాడు. రాగుల పవన్ కుమార్ (19) అనే వ్యక్తి గల్లంతు కాగా జాలర్ల అప్రమత్తత వల్ల మిగిలిన ఇద్దరు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన ఆదివారం ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గోదావరి నదిలో చోటు చేసుకుంది. ధర్మపురి ఎస్సై మహేష్ కథనం ప్రకారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ కి చెందిన రాగుల పవన్ కుమార్, నవిత్ వర్మ, బొగే అశ్విన్ అనే ముగ్గురు యువకులు సాయంత్రం సమయంలో రాయపట్నం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగారు.

నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇది గమనించని యువకులు లోనికి వెళ్లగా ప్రవాహం ధాటికి నదిలో కొట్టుకు పోయారు.ఈ సమయంలో యువకులు అరిచిన అరుపులు విని సమీపంలో ఉన్న జాలర్లు తక్షణమే స్పందించి నవిత్ వర్మ, అశ్విన్ లను రక్షించి ఒడ్డుకు చేర్చారు.అయితే జాలర్లు ఘటన స్థలానికి చేరుకునే సరికే రాగుల పవన్ కుమార్ గల్లంతయ్యాడు. ఆయన కోసం జాలర్లు చీకటి పడే వరకు గాలించినా మృతదేహం లభించలేదు. ఇంకా గాలింపు జరుగుతోంది . అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలించడం కష్టంగా ఉంది. నదిలో నీట మునిగి ఆందోళనతో అపస్మారక స్థితికి చేరుకున్న నవిత్ వర్మ తో పాటు అశ్విన్ ను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా వారు తొందరగానే కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారని ధర్మపురి ఎస్సై మహేష్ తెలిపారు.

భవాని మాల కోసం పుణ్య స్నానాలకు వెళ్లి పరలోకానికి ..

స్నేహితులు ముగ్గురు శ్రీనగర్ కాలనీ కి చెందిన వారు వీరంతా డిగ్రీ చదువుతున్నట్టు సమాచారం. కాగా కొద్ది రోజుల్లో శరన్నవరాత్రుల సందర్భంగా భవాని మాల వేసుకొని దుర్గా మాతను ప్రతిష్టించాలని కోరికతో స్నేహితులైన ముగ్గురు యువకులు రాయపట్నం వద్దకు గోదావరి పుణ్య స్థానానికి రాగ అందులో ఒకరు నదీ ప్రవాహం ధాటికి నీట మునిగి పరలోకానికి వెళ్లారు. భవాని మాల వేసుకుని అమ్మవారిని నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతో పూజ చేయాలనే పవన్ కుమార్ కోరిక నెరవేరకుండానే గోదావరిలో మునిగి అదృశ్యం కావడం విచారకరం. ఆనందంతో పుణ్య స్నానాలకు నదిలోకి దిగిన యువకులకు రెప్పపాటులో విషాదం ఎదురవటం అందులో ఒకరు గళ్లంతవటం మండలంలో సంచలనం కలిగించింది.

Advertisement

Next Story