- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
adulterated : కల్తీ కల్లు సేవించి డిగ్రీ విద్యార్థి అనిల్ మృతి

దిశ, అచ్చంపేట: మత్తు ఏ రూపంలో ఉన్న వాటికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రధానంగా యువత బానిస అవుతున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కొండనాగుల గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న ఒక యువకుడు కల్తీ కల్లుకు బానిసై మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. తద్వారా కోపోగ్రస్తులైన గ్రామస్తులు ఆగ్రహం తో కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. గ్రామస్తులు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొండనాగుల గ్రామానికి చెందిన అనిల్ (23) అనే యువకుడు హైదరాబాద్ లో ఉంటూ డిగ్రీ విద్యాభ్యాసం చేస్తున్నాడని, దసరా సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామంలో విక్రయించే కల్లు సేవించి దానికి బానిస అయ్యాడన్నారు.
అసలు సిసలైన కల్లు ఎక్కడ దొరుకుతలేదనేది ఎంత నిజమో... అంతకంటే ఎక్కువ కల్తీ కల్లు తయారవుతున్నది అంతే నిజమని ఆ కల్తీ కల్లులో మత్తు పదార్థం ఉండటం వలన యువత సైతం కల్లుకు బానిస అవుతున్నారని.. ఈ క్రమంలో అనిల్ తాపత్రయపడుతూ నిత్యం తాగి రోడ్లపై సొలుగతూ తిరిగేవాడన్నారు. సోమవారం సాయంత్రం కూడా కల్లు దుకాణం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, అతడిని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. అందుకు మృతదేహాన్ని కల్లు దుకాణం ముందు ఉంచి ఆందోళన చేపట్టి కోపంతో ఆ కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో కొద్ది గంటలు గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ రవీందర్ ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
కల్తీకల్లు పై సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలే...
గ్రామంలో కల్తీకల్లు మరింత విచ్చలవిడిగా అమ్ముతున్నారని దానిని అరికట్టాలని అచ్చంపేట ఎక్సైజ్ శాఖ పోలీసులకు చెప్పిన పెడచెవిన పెట్టారని, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లామని అయినా సంబంధిత శాఖ అధికారులు ఎవరూ స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీకల్లు నివారణ చేసే విషయంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలం చెందిందని వారి నిర్లక్ష్యం మూలంగానే యువకుడు మృతి చెందాడని, ఇతనితో పాటు ఉన్న మరో యువకుడు కూడా ఇప్పటివరకు జాడ లేడని ఏమయ్యాడో తెలియని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ప్రాణం ఖరీదు రూ. 3.5 లక్షలు..?
కల్తీ కల్లు సేవించి మృతి చెందిన యువకుడు అనిల్ ప్రాణం ఖరీదు రూ. 3.5 లక్షలు కల్లు యజమాని ఇచ్చేలా ఒక తీర్మానానికి వచ్చినట్లు తెలుస్తుంది. భయానా రూపంలో రూ. 50 వేలు బాధితుల కుటుంబానికి చెల్లించి కొంత వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు కాకుండా అతి సులువుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని గ్రామంలో జోరుగా చర్చ జరుగుతోంది. బాధిత కుటుంబానికి నష్టపరిహారం తో పాటు కల్తీకల్లు విక్రయాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
సీఐ రవీందర్ వివరణ…
కల్తీ కల్లు సేవించి మృతి చెందిన అనిల్ సంఘటనపై అచ్చంపేట సీఐ రవీందర్ ను దిశ ఫోన్ ద్వారా వివరణ కోరగా.. కల్తీ కల్లు సేవించి మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారని, వారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తప్పక చర్యలు తీసుకుంటామన్నారు.