చేపల వేట కోసం వెళ్లి కుంటలో మునిగి బాలుడు మృతి

by Kalyani |
చేపల వేట కోసం వెళ్లి కుంటలో మునిగి బాలుడు మృతి
X

దిశ, జగదేవపూర్: కుంటలో చేపల వేట కోసం వెళ్లి ఓ బాలుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మాందాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మాందాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వెంకటేశం ప్రమీల దంపతులకు ముగ్గురు కుమారులు గ్రామాలలో బుర్రకథలు, చిందు వేషధారణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో పెద్ద కుమారుడు నరేష్, రెండవ కుమారుడు అరవింద్ (17) మూడవ కుమారుడు సంతోష్ ఉన్నారు. మృతుడు అరవింద్ తిగుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అక్కడే ఉన్న బీసీ హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు.

కాగా ఆదివారం సెలవు దినం కావడంతో అరవింద్ అతని తమ్ముడు సంతోష్, చిన్నాన్న కుమారులైన మరో ఇద్దరితో కలిసి మాందాపూర్ లోని బతుకమ్మ కుంటలో చేపలు పట్టడానికి నలుగురు వెళ్లారు. అరవింద్ చేపల కోసం కుంటలోకి దిగాడు.‌ కుంట లోతుగా ఉండి అరవింద్ కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. కుంట గడ్డపై ఉన్న మరో ముగ్గురు బాలురు పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు తెలుపగా వారు వచ్చి నీటిలో మునిగిన అరవిందును బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed