నిజమైన వారసులు కమ్యూనిస్టులే..ఆర్ఎస్ఎస్‌పై సాధుల శ్రీనివాస్ ఆగ్రహం

by Shyam |   ( Updated:2021-09-15 08:12:47.0  )
CPM leader Srinivas
X

దిశ, బయ్యారం: తెలంగాణ ప్రాంతంలో నైజాం రాజరిక పాలనకు, జమీందార్లు, జాగీర్దార్ల, పటేల్, పట్వారీ దొరల అకృత్యాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర వీర తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని మంగపతిరావు భవనంలో వంగూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సదస్సు’ జరిగింది. ఈ సదస్సులో సాధుల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. సాయుధ పోరాటానికి సంబంధం లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు చరిత్రను వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. సాయుధ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా కమ్యూనిస్టులు వీరమరణం పొందారని గుర్తుచేశారు. రాజరిక పాలన సాగిస్తున్న నైజాంను అంతం చేసిన ఈ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప పోరాటం అని కొనియాడారు.

చరిత్రను కొంతమంది వక్రీకరిస్తున్నారని, ఆ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని కాషాయ శక్తులైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు సాయుధ పోరాటంలో పాల్గొన్నట్లు చరిత్రను వక్రీకరిస్తే కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. భూస్వాముల నుండి 10 లక్షల ఎకరాల భూములను లాక్కొని పేదలకు పంచిన చరిత్ర ఎర్రజెండాకు ఉందన్నారు. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన పోరాటాన్ని ప్రభుత్వాలు అధికారికంగా జరుపకపోవటం దారుణమని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు సూర్ణపు సోమయ్య, శెట్టి వెంకన్న, కందునూరి శ్రీనివాస్, గిరి ప్రసాద్, రాజారావు, గోవింద్, రమా, నాగమణి, మౌనిక, రామకృష్ణ, శివకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Next Story