‘కొండపోచమ్మ సాగర్‌ అభినందనీయం.. కానీ’!

by Shyam |
‘కొండపోచమ్మ సాగర్‌ అభినందనీయం.. కానీ’!
X

దిశ, న్యూస్‌బ్యూరో: దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ విషయమై శుక్రవారం వెంకటరెడ్డి ఓ ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండ పోచమ్మ సాగర్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. కానీ, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నదని గుర్తు చేశారు.

కరోనా మూలంగా ప్రజలను కష్టాలలోకి నెట్టి ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తున్నదని విమర్శించారు. ‘ గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో 50శాతం కోత విధించడం, చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించడం అన్యాయమన్నారు. గత రెండు నెలలుగా రేషన్ కార్డుదారులకు ఇస్తున్న రూ.1500 ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించి ప్రజలను విస్మయానికి గురిచేసిందని చెప్పారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్‌లకు పూర్తి పెన్షన్ చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేస్తుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed