‘తెలంగాణ ప్రభుత్వం బెదిరింపులకు కేఆర్ఎంబీ లొంగిపోయిందా ?’

by srinivas |
‘తెలంగాణ ప్రభుత్వం బెదిరింపులకు కేఆర్ఎంబీ లొంగిపోయిందా ?’
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసిందనే సాకుతో కృష్ణానది యాజమాన్య బోర్డు వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు దాఖలు చేయాలని కోరడం సరికాదన్నారు. దాదాపు పూర్తైన వెలిగొండ ప్రాజెక్ట్ డీపీఆర్ అడగడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కేఆర్ఎంబీ ఆదేశాలను లెక్కచేయకుండా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

తెలంగాణ ప్రభుత్వ బెదిరింపులకు కృష్ణానది యాజమాన్య బోర్డు లొంగిపోయినట్లు ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఇకపోతే వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టులపై కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాసింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే ఏపీ ఈఎన్‌సీకు లేఖ రాశారు. వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు దాఖలు చేయాలని లేఖలో కోరారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని అతిక్రమిస్తూ ఏపీ ప్రభుత్వం వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుతోందని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కేఆర్ఎంబీ రెండు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌ల దాఖలు చేయాలని కోరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed