కమ్యూనిస్టులపై నోరు జారితే మర్యాదగా ఉండదు.. ఎమ్మెల్యే రేగాకు వార్నింగ్

by Sridhar Babu |
CPI leaders Bolloju Ayodhya
X

దిశ, మణుగూరు: ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుపై సీపీఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం మణుగూరు మండలంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాలం చెల్లిన కమ్యూనిస్టులు అని మరోసారి నోరు జారితే మర్యాదగా ఉండదని అయోధ్య వార్నింగ్ ఇచ్చారు. కమ్యూనిస్టులపై నోరు జారితే నీ పదవికి, వ్యక్తిత్వానికి కాలం చెల్లినట్టేనని హెచ్చరించారు. రేగాకు కమ్యూనిస్టులే ఎమ్మెల్యే పదవి భిక్షం పెట్టారని గుర్తుచేశారు. ‘‘వందపడకల ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది లేరని తాము రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే మా మీద ఎగిసిపడతావా? ప్రజల సమస్యల కోసం సీపీఐ పోరాటం చేస్తుంటే కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని పిచ్చి కూతలు కూస్తావా?, నీకు అంత దమ్ము ఉందా?’’ అని సవాల్ విసిరారు.

తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో వ్యతిరేకంగా పనిచేసిన రేగా, ఈరోజు కేసీఆర్ పక్కన చేరి నియోజకవర్గాన్ని దోచుకు తింటున్నాడని మండిపడ్డారు. అది నిజం కాకపోతే అంబేద్కర్ సాక్షిగా వస్తావా? మాట్లాడుకుందాం అని రేగాకు సవాల్ చేశారు. మండలంలోని వందపడకల ఆసుపత్రిలో ఆరు సంవత్సరాలు నుంచి డాక్టర్లు, సిబ్బంది లేరని తెలిపారు. విష జ్వరాలతో ఇంటికి ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ముమ్మాటికీ వైద్యం లేక, ఎమ్మెల్యే రేగా నిర్లక్ష్యంతో ప్రజలు చనిపోతున్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, జిల్లా సమితి సభ్యులు ఆర్.లక్ష్మినారాయణ, అక్కి నర్సింహా రావు, మణుగూరు పట్టణ మండల కార్యదర్శి ఎస్కే సర్వర్, దూర్గ్యాల సుధాకర్, కార్యవర్గ సభ్యులు చింతల దశరథం, వీరమ్మ, గుంటురు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story