వాహనదారులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. బయటకు వచ్చారో..

by Shyam |
వాహనదారులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. బయటకు వచ్చారో..
X

దిశ, రాజేంద్రనగర్ : అవసరం ఉంటేనే తప్ప బయటకు రావాలి.. కానీ అనవసరంగా బయట తిరిగితే కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. రెండవ రోజు లాక్‌డౌన్ సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని అత్తాపూర్, శివరాంపల్లి, ఆరాంఘర్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్‌లను కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వారు వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ రెండో రోజు అమలవుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 75 చెక్‌పోస్టులు, 5 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిత్యావసర సరుకుల సమయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రోడ్లపై షాపులు తెరిచి ఉంటాయని దానికనుగుణంగా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి 10 గంటల లోపు ఇంటికి వెళ్ళిపోవాలని అన్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

నిత్యవసర సరుకుల కొరకు ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే వచ్చి సరుకులు తీసుకొని వెళ్లాలన్నారు. ఇంట్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే తమతో పాటు తమ కుటుంబానికి నష్టం చేకూరుతుందన్నారు. ఇంటి నుంచి ఎవరు బయటకు వచ్చినా మాస్కు తప్పనిసరిగా ధరిస్తూ శానిటైజర్ వాడుతూ సామాజిక దూరం పాటించాలన్నారు.

లాక్‌డౌన్‌ను మనమందరం పటిష్టంగా అమలు చేస్తేనే కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ తమ తమ ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవాలని అన్నారు. లాక్‌డౌన్ సందర్భంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉంటే ఈ-పాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలని అన్నారు.

Advertisement

Next Story