18 గంటలపాటు ప్రసవ వేదనతో అల్లాడిన ఆవు చివరకు

by Shyam |   ( Updated:2021-08-10 23:23:00.0  )
18 గంటలపాటు ప్రసవ వేదనతో అల్లాడిన ఆవు చివరకు
X

దిశ, జడ్చర్ల : సుమారు 18 గంటలపాటు ప్రసవ వేదనతో అల్లాడుతూ ప్రాణాలతో పోరాడుతున్న ఆవుకు పశు వైద్య అధికారులు ఆపరేషన్ చేసి, పునర్జన్మ ప్రసాదించారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ధోనూర్ గ్రామంలో ప్రసవ వేదన‌తో బాధపడుతున్న ఆవుకు వెటర్నరీ డాక్టర్ శ్రావణి ఆపరేషన్ చేసి దూడను బయటకు తీయడంతో ప్రాణ గండం తప్పింది. ధోనూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రైతు శ్రీనివాస్ గౌడ్ కు చెందిన ఆవు సోమవారం మధ్యాహ్నం నుండి ప్రసవవేదనతో అల్లాడింది, రాత్రి ఆవు వేదన వర్ణనాతీతం.. దీంతో రైతు భయపడి మంగళవారం తెల్లవారుజామున మండల పశు వైద్యాధికారి శ్రావణికి సమాచారం అందించారు. ఆమె వెంటనే ధోనూర్ గ్రామానికి చేరుకొని ఆవుకు సాధారణ ప్రసవం చేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. చివరకు సాధారణ ప్రసవం అయ్యే సూచనలు లేకపోవడంతో మిడ్జిల్ మండలానికి చెందిన తాండూరు పశువైద్యాధికారి రాజేష్ సహాయంతో కలిసి డాక్టర్ శ్రావణి ఆవుకు సుమారు 4 గంటలు కష్టపడి ఆపరేషన్ చేసి దూడను బయటికి తీశారు. దీంతో ఆవుకు ప్రసవ వేదనలు తప్పి పునర్జన్మ ఇచ్చినట్లయింది.

ప్రస్తుతం ఆవుదూడ రెండు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని డాక్టర్ శ్రావణి తెలిపారు. ఆవులకు ప్రసవవేదన అనేది చాలా అరుదుగా ఉంటుందని సంవత్సరంలో 12 కేసులు వస్తుంటాయని, ఇలా జరగడానికి కారణం ఆవు కడుపులో దూడ అడ్డుగా ఉండడం, తల కాళ్ళు పక్కకు ఉండడం వలన ఆవు ప్రసవం కాకపోవడం జరుగుతుందని తెలిపింది. ఆవు ఈత పడిందంటే గంటలో ప్రసవం కావాలని అలా జరగకపోతే రైతులు స్థానిక వైద్యులను సంప్రదించాలన్నారు. ఒకవేళ సమాచారం త్వరగా ఇవ్వనట్లయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని దాని వలన ఆవు, దూడల ప్రాణాలకు ముప్పు తలపించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆవుకు ఆపరేషన్ చేసి దూడకు జన్మనిచ్చి, ఆవుకు ప్రసవ వేదన తప్పించి పునర్జన్మ ప్రసాదించిన మిడ్జిల్ మండల పశువైద్యాధికాని శ్రావణికి, తాండూరు పశువైద్యాధికారి రాజేష్‌లకు పశు వైద్య సిబ్బందికి రైతు శ్రీనివాస్ గౌడ్ గ్రామ రైతులు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆవు దూడ రెండు క్షేమంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed