హైదరాబాద్‌లో కొవిడ్ రూల్స్ బ్రేక్

by Anukaran |
హైదరాబాద్‌లో కొవిడ్ రూల్స్ బ్రేక్
X

దిశ ప్రతినిధి,హైదరాబాద్: పండుగల పేరుతో కొంత మంది కొవిడ్ -19 నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పండుగలు ఇంటిపట్టునే చేసుకోవాలని ప్రభుత్వం నెత్తినోరు బాదుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర రాజదానిలో ఉన్న ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ వంటింది. అలాంటి నగరాన్ని కొంతకాలంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్నది. పరిస్థితి చేయిదాటకుండా ప్రభుత్వం కొవిడ్ 19 పేరిట కొన్నినిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఎవరూ మాస్కులు లేకుండా బయటికి రావొద్దని, వచ్చినా సోషల్ డిస్టెన్స్ వంటి కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పింది. అలాగే ఎటువంటి పండుగులైనా ఇంటి పట్టునే చేసుకోవాలని తేల్చి చెప్పింది.

కానీ, ఈ రూల్స్ అమలు అవుతున్నాయా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని రెండు వర్గాల ప్రజలు పండుగలు వచ్చాయంటే గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. యథేచ్ఛగా తిరుగుతూ కొవిడ్ విస్తృతికి కారణం అవుతున్నారు.

చేష్టలుడిగి చూస్తున్న అధికారులు..

కొవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారి పట్ల అధికారులు మొదటి నుంచి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగూ ఎవరూ ఏమీ అనడం లేదని మరింత రెచ్చిపోయి గుంపులుగా తిరుగుతున్నారు. అవగాహన కల్పించాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతున్నది. గత నెలలో ఓ వర్గానికి చెందిన రెండు ముఖ్య పండుగల సందర్భంగా పాతబస్తీలో వేలాది మంది మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా రోడ్లపై చేరారు.

గుంపులు గుంపులుగా గుమిగూడినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితోనే కరోనా వ్యాప్తి చెందిందని సాక్షాత్తు సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. మర్కజ్ లింకు లేకపోతే తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రం అయ్యుండేదని అప్పట్లో ప్రకటించారు. కరోనా వ్యాప్తికి కారణమైన సామాజిక వర్గం వారే మరోమారు ఇటీవల పాతబస్తీలో వేల సంఖ్యలో గుమిగూడినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఒకరి పాపం..మరొకరికి శాపం..

కరోనా ప్రభావంతో నాటి నుంచి నేటి వరకు విద్య, వ్యాపారాలు మూతపడ్డాయి. చాల మంది తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కరోనా బాధితులు పెరిగారు. ఇది ప్రభుత్వ ఆదాయంపై పెను ప్రభావం చూపుతున్నది. ఉద్యోగులు, పెన్షనర్లు సగం జీతంతో సరిపెట్టుకుంటున్నారు. ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చిన పేద ప్రజలు తిరిగి తమ సొంత ఊర్లకు వెళ్లి పోతున్నారు. పరిస్థితి మరింత చేయిదాటకుండా వ్యవహరించాల్సిన అధికారులు రూల్స్ బ్రేక్ చేసేవారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

పండుగల పేరిట కొందరు హద్దులు మీరి ప్రవర్తించడంతో పట్టణంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఒక్క కరోనా పేషెంట్‌తో వందల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిసినా ఓ వర్గం ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. పండుగలను అడ్డు పెట్టుకుని కొంత మంది విచ్చల విడిగా తిరుగుతుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కొవిడ్ రూల్స్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story