పత్తి పంట దళారుల పాలు

by Shyam |
పత్తి పంట దళారుల పాలు
X

రైతులు కష్టపడి పండించిన పత్తి పంట దళారుల పాలవుతోంది. భారీ వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టం వాటిల్లడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. చేతికొచ్చిన కొంత పంటనైనా అమ్ముకుందామంటే ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ప్రారంభించలేదు. పత్తి కాయలపై మొలకలు రావడంతో పంట అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. దళారులు దీన్ని ఆసరాగా చేసుకుని వీలైనంత తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. అధికారులు సైతం దళారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

దిశ, నాగర్‌కర్నూల్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు చాలా వరకు రైతులు పత్తి పంట సాగుచేశారు. మొదటి నుంచి పంట ఆశాజనకంగానే పెరిగినా.. చేతికందే సమయానికి భారీ వర్షాల కారణంగా పంట నీట మునడగంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి కాయలపైనే మొలకలు వచ్చాయి. కాస్తో, కూస్తో చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు రైతుల వద్ద వాలిపోతున్నారు. వీలైనంత తక్కువకు పంటను కొనుగోలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు తమ పంటను అమ్ముకుని నష్టపోతున్నారు. దీనికి తోడు తూకాల్లో సైతం దళారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పత్తిని దాచుకునేందుకు సౌకర్యాలు లేక క్వింటాల్ పత్తిని రూ.3వేలకే అమ్ముకుంటున్నారు. జిల్లాలో లక్షా 79 వేల 843మంది రైతులు.. 4లక్షల 55వేల 803 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. ఇందులో 5లక్షల 56 వేల 173 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ అధిక వర్షాల కారణంగా లక్ష 82వేల ఎకరాల్లో 33శాతం పత్తి పంట దెబ్బతిన్నదని అధికారులు అంచనా వేశారు.

దళారులతో అధికారులు కుమ్మక్కు?

విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు పత్తి పంట ఎకరాకు రూ.30వేలకు పైగా ఖర్చు వస్తోందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో ఎకరాకు నాలుగు క్వింటాళ్లు సైతం దిగుబడి రావడం కష్టమేనని అంటున్నారు అన్నదాతలు. చివరికి దళారులు క్వింటాల్‌కు రూ.3 వేలు చెల్లించి పంటను తీసుకెళ్లున్నాడని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు తూకాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తే తమకు మేలు జరిగేదని చెబుతున్నారు. నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంంభించకపోవడానికి కారణమేంటన్న రైతుల ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. మరి కొన్ని చోట్ల దళారులు రైతులను భయబ్రాంతులకు గురి చేసి ‘జోక్కిందే తూకం.. ఇచ్చిందే ధర’ అన్న విదంగా వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులతో కలిసి అధికారులు కుమ్మక్కయ్యారని అందుకే ఈ మోసాన్ని వారు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో 7 కొనుగోలు కేంద్రాలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో పత్తి కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఇండియా (సీసీఐ కేంద్రాలు) 7 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వీటిని నవంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు.

పంటను దళారులకు అమ్మొద్దు : బాలమణి, మార్కెటింగ్ శాఖ అధికారి

రైతులు ఆందోళనకు గురై పంటను దళారులకు అమ్ముకోవద్దు. దళారులు తక్కువ ధర చెల్లిస్తూ.. తూకాల్లో మోసాలకు పాల్పడే అవకాశముంది. దీని వల్ల రైతులు నష్టపోయే ప్రమాదముంది. త్వరలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. తూకాల్లో మోసాలకు పాల్పడితే ఫిర్యాదు చేయండి.

Advertisement

Next Story

Most Viewed