రష్యాలో ఒకేరోజు 9600 కరోనా కేసులు

by  |
రష్యాలో ఒకేరోజు 9600 కరోనా కేసులు
X

– ప్రపంచ దేశాల్లోనూ తగ్గని వైరస్ ఉధృతి

వాషింగ్టన్/మాస్కో: కరోనా వైరస్ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. వారం రోజులు తగ్గినట్లు కనిపిస్తున్న ఈ వైరస్ వ్యాప్తి.. మరో వారం బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా, యూరోప్ దేశాల్లో ప్రస్తుతం ఈ వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 34 లక్షల కరోనా బాధితులు నమోదు కాగా, కేవలం అమెరికా, యూరోప్ దేశాల్లోనే సగంపైగా పాజిటివ్ కేసులు ఉండటం గమనార్హం. కొవిడ్-19 దెబ్బకు ఇప్పటి వరకు 2,39,566 మంది చనిపోయారు. కాగా, అగ్రరాజ్యం అమెరికాలో శనివారం వరకు 11,28,460 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక్కడ మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇప్పటి వరకు 35,435 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు యూరోప్ ఖండంలోనూ ఇదే పరిస్థితి. కరోనాకు కేంద్రంగా మారిన ఇటలీలో ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రతీ రోజు ఇక్కడ భారీగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు 2,07,429 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 28,236 మంది మరణించారు. స్పెయిన్‌లో 2,15,216 కేసులు నిర్థారణ కాగా 24,824 మరణాలు సంభవించాయి. బ్రిటన్‌లో 1,77,454 కేసులు, జర్మనీలో 1,64,054 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు కరోనా గుర్తించిన తొలి రోజుల్లో చైనా సరిహద్దును మూసేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న రష్యాలోనూ ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజు రష్యాలో 9600 కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తం 1,14,431 కేసులు నమోదు కాగా 1169 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని పొడిగించారు. జులై 24 వరకు అత్యవసర స్థితిని పొడిగిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఒలివియర్ వెరన్ వెల్లడించారు. ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 1,30,185 కేసులు నమోదు కాగా, 24,594 మంది మృతి చెందారు. గేట్‌వేగా పిలుచుకొనే టర్కీలోనూ కరోనా స్వైర విహారం చేస్తోంది. అక్కడ 1,22,392 కేసులు నమోదుకాగా, 3258 మరణాలు సంభవించాయి. ప్రపంచంలోని వివిధ దేశాలతో పోలిస్తే ఇండియాలోనే వైరస్ వ్యాప్తి నెమ్మదిగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Tags : Coronavirus, Covid-19, USA, Europe, Italy, Russia, France, Health Emergency, Death Toll



Next Story

Most Viewed