లక్షణాల్లేనివారి నుంచి వ్యాప్తి అరుదు

by  |
లక్షణాల్లేనివారి నుంచి వ్యాప్తి అరుదు
X

దిశ, వెబ్‌డెస్క్:
లాక్‌డౌన్ 5.0లో ఆంక్షలతో కూడిన సడలింపులు ఇవ్వడంతో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతీ రోజు దేశవ్యాప్తంగా 9 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా రాష్ర్టంలో వంద నుంచి రెండు వందల మధ్య కేసులు వెలుగుచూస్తున్నాయి. చాలామందిలో లక్షణాలు కనిపించకపోవడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. కరోనా లక్షణాలు లేని వాళ్లు అందరిలానే మామూలుగా సమూహాల్లో తిరుగుతుంటారు. అలాంటి వ్యక్తుల నుంచి ఎంతమందికి కరోనా సోకుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొద్దిగా ఊరటనిచ్చే వార్త వినిపించింది. ఎలాంటి లక్షణాలు లేకుండా, పాజిటివ్‌ వచ్చినవారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందటం చాలా అరుదని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది.

ఇటీవల కాలంలో లక్షణాల్లేని కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ 60 ఏళ్ల వృద్ధురాలు.. మోకాళ్ల నొప్పులు ఉండటంతో హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడి వైద్యులు చికిత్స చేయడంతో ఆమెకు కరోనా పాజిటిల్ ఉన్నట్లు తేలింది. ఒక్క మనరాష్ర్టమనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి తమకు కరోనా ఉన్నట్లు తెలియడం లేదు. దాంతో లక్షణాలు లేని వారి నుంచి అత్యంత వేగంగా వైరస్ వ్యాపిస్తోందని, అందుకే వైరస్ వ్యాప్తి తగ్గడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే లక్షణాలు లేని బాధితుల నుంచి ఇతరులకు వ్యాధి సోకడం అరుదు అని డబ్య్లూహెచ్‌వో కరోనా టెక్నికల్ లీడ్ మారియా వాన్‌ కెర్ఖోవ్‌ అన్నారు. అలాంటి వారి నుంచి 6 శాతం మాత్రమే వైరస్‌ ఇతరులకు సోకుతుందని చెప్పారు. ‘మేం పరిశీలించిన డేటా ప్రకారం లక్షణాలు లేని వారి నుంచి వైరస్ సోకడం చాలా అరుదని తేలింది అని ఆమె స్పష్టం చేశారు.


Next Story

Most Viewed