గ్రేటర్‌ను కమ్మేస్తోన్న కరోనా​

by  |
గ్రేటర్‌ను కమ్మేస్తోన్న కరోనా​
X

దిశ ప్రతినిధి, మేడ్చల్/ హైదరాబాద్: గ్రేటర్ లో కరోనా ప్రతీ ఇంటిని తాకుతున్నది. కనిపించని వైరస్​తో ప్రజలు యుద్ధం చేస్తున్నారు. మహమ్మారి ఏ వైపు నుంచి వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రులు సరిపోని విధంగా కేసులు సంఖ్య పెరిగిపోతున్నాయి. గ్రేటర్ దాటిన కరోనా రోజు పదుల సంఖ్యలో కొత్త గ్రామాలను తన ఖాతాలో వేసుకుంటూ ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల కొరత ఉందని, రోగులను పట్టించుకోవడం లేదని సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీంతో పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో లక్షలాది రూపాయలు వెచ్చించలేక ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన రోగులు తమ పక్క వారికి కూడా తెలియకుండా గుట్టుగా హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.
గ్రేటర్ ముట్టడి..

గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నాయి. వీటిని ఆనుకోని విస్తరించిన శివారు ప్రాంతాలు పట్టణాలుగా రూపాంతరం చెందాయి. ఈ డివిజన్లు, పట్టణాల్లో ఏ ఒక్కదానికి మినహాయింపు లేనట్టుగా కరోనా వ్యాపించింది. నగరంలో ఏ పరీక్ష కేంద్రానికి వెళ్లిన కొవిడ్ లక్షణాలతో బారులు తీరిన జనమే కన్పిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు లెక్కల్లో తేలుతోంది. దీంతో హైదరాబాద్ మహానగరంలోని ప్రతి వీధిలోనూ కరోనా కేసులు నమోదవుతున్నట్లు స్పష్టమవుతోంది. 15 రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో గ్రేటర్ లోనే దాదాపు 80శాతం కేసులు వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు తేల్చాయి.

అపార్ట్ మెంట్లలో అధికం హైదరాబాద్ వంటి మహానగరంలో బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్లు చాలా ఉన్నాయి. వీటిల్లో నివాసం ఉంటున్న వారిలో కొంతమంది పాజిటివ్ రాగానే పక్క ఫ్లాట్ వారికి కూడా తెలియకుండా హోం క్వారెంటైన్ లో ఉంటున్నారు. ఇలాంటి వారు తమ కుటుంబ సభ్యులను ముందుగానే ప్రత్యామ్నాయంగా బంధువుల ఇళ్లకు, గ్రామాలకు పంపిస్తుండగా ఇలాంటి అవకాశం లేని వారు ఫ్లాట్ లోనే ఓ గదిలో కరోనా తగ్గే వరకూ ఉంటున్నారు. సుమారు రెండు వారాల క్వారంటైన్ తర్వాత బయటకు వచ్చి తమకు కరోనా పాజిటివ్ వచ్చందని, హోం క్వారెంటైన్ లో ఉన్నానని పక్క వారికి చెబుతుండడంతో వారు బెదిరిపోతున్నారు.

కరోనాతో ప్రజల సహవాసం

కరోనా వైరస్ మొదలైన రోజుల్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే సమీపంలో ఉన్న వారు ఆమడ దూరం పరిగెత్తేవారు. రోగి ఉంటున్న ఇంటి పరిసరాలకు వెళ్లేందుకు భయపడేవారు. దీనికి తోడు అధికారులు కూడా ఆయా ప్రాంతాలను మూసి వేసి కట్టడి చేసేవారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం చెప్పినట్లు కరోనాతో సహజీవనం చేస్తున్నారు. మొదట్లో కరోనా బారిన
పడిన వారికి జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కన్పించేవి. రోజులు గడుస్తున్న కొద్ది డాక్టర్లు చెబుతున్నట్లుగా వ్యాధి కూడా దారి మార్చినట్లు కనబడుతోంది. ఎలాంటి లక్షణాలు లేని వారికి కరోనా పాజిటివ్ వస్తోంది. దీంతో వారు వైద్యుల సలహాలు తీసుకుని హోం క్వారంటైన్ కు పరిమితం అవుతున్నారు.

పల్లె దారిలో కరోనా

గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితమైన కరోనా ప్రస్తుతం పల్లెలను పట్టిపీడుస్తున్నది. రోజుల వ్యవధిలో ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని గ్రామాల్లో సైతం వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వచ్చిన పాజిటివ్​ కేసులతో కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు కిటకిటలాడి పోతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో బెడ్ల కొరత లేదని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం బెడ్లు దొరకలేదని బాధితులు వాపోతున్నారు. ఒక వైపు కేసులు పెరిగిపోతుండడం.. మరోవైపు వైద్యం అందకపోతుండడంతో ప్రజల్లో భయం పెరిగిపోయింది.


Next Story

Most Viewed