కరోనా కేసుల పెరుగుదల 40శాతం పడిపోయింది : కేంద్రం

by  |
కరోనా కేసుల పెరుగుదల 40శాతం పడిపోయింది : కేంద్రం
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో మనదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్ కంటే ముందు పరిస్థితులతో పోలిస్తే కరోనా కేసుల పెరుగుదల 40శాతం పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. లాక్‌డౌన్‌కు ముందు ప్రతి మూడు రోజులకు రెట్టింపు కరోనా కేసులు నమోదవ్వగా.. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు కాస్త మెరుగయ్యాయని తెలిపింది. 6.2 రోజులకు కరోనా కేసులు రెట్టింపవుతున్నాయని వివరించింది. ఈ రెట్టింపు రేటు.. అధికంగా కొన్ని రాష్ట్రాల్లోనే నమోదవుతున్నదని పేర్కొంది. 19 కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో జాతీయ సగటు రెట్టింపు రేటు కంటే తక్కువే ఉన్నదని వివరించింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలను పెద్దమొత్తంలో పెంచినప్పటికీ ఈ కరోనా కేసుల గ్రోత్ రేట్ తగ్గిపోవడం శుభపరిణామమని వివరించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13,835కి చేరినట్టు పేర్కొంది. కరోనా మరణాలు 452కి పెరిగాయని, అలాగే ఈ మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,767కి చేరిందని వెల్లడించింది.

80శాతం పేషెంట్లు కోలుకుంటున్నారు..

కరోనా కేసులు వేగంగా నమోదవుతున్నా.. చివరకు చాలా మంది పేషెంట్లు ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన కరోనా పేషెంట్లు, ఈ వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుందని తెలిపారు. 80శాతం మంది ఈ వైరస్ నుంచి బయటపడితే.. 20శాతం మంది మాత్రమే బలవుతున్నారని వివరించారు. అయితే, ప్రతి ఒక్కరి ప్రాణాన్నీ కాపాడేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.

అలాగే, విరివిగా టెస్టులు నిర్వహించడంపై దృష్టి పెట్టినట్టు ఆరోగ్యశాఖ వివరించింది. ర్యాపిడ్ టెస్టు కిట్ల వినియోగం, పూలింగ్ విధానంలో పరీక్షలు నిర్వహణకు యోచిస్తున్నట్టు తెలిపింది. ఈ పద్ధతుల్లో తక్కువ సమయంలో అధిక నమూనాలను టెస్టు చేయవచ్చునని పేర్కొంది. ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టడంపైనా కసరత్తులు జరుగుతున్నాయని తెలిపింది. సీఎస్ఐఆర్ ల్యాబ్‌లలో యాంటీ వైరల్ ఉత్పత్తికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని పేర్కొంది. మే నెలలో స్వదేశీ టెక్నాలజీతో పది లక్షల ర్యాపిడ్ టెస్టుల తయారీకి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు వివరించింది. ఒక్క నెల వ్యవధిలో ఆరువేల వెంటిలేటర్లను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి ఉన్నదని చెప్పింది. ఇప్పుడు మన దేశంలో కొవిడ్ 19కోసం ప్రత్యేకంగా 1,919 ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఇందులో 1.73 లక్షల ఐసొలేషన్ పడకలు, 21వేల ఐసీయూ బెడ్‌లున్నాయని తెలిపింది.

Tags: coronavirus, deaths, cases, health ministry, doubling rate, decline


Next Story

Most Viewed