కరోనా పుట్టింది అక్కడ కాదట!

కొవిడ్ 19 ఎక్కడ పుట్టింది? అనే ప్రశ్న చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఎవరిని అడిగినా గుక్కతిప్పుకోకుండా ఒక్కటే పేరు చెప్తారు. ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే వాళ్లు కుక్కలు, గబ్బిలాలు తినడం వల్లేనని ముఖం మీద వికారమైన హావభావాలు పలికిస్తూ మరీ చెబుతారు. దాదాపు మీరు అదే సమాధానాన్ని, అలాంటి హావభావాలనే పెట్టి ఉంటారు. కానీ బాగా చదువుకుని, ఎన్నో పరిశోధనలు చేసి మంచి పేరు సంపాదించుకున్న ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు మాత్రం అందుకు భిన్నమైన సమాధానం చెబుతున్నారు. అంత చదువు చదివి, ఇంత చిన్న విషయం తెలియదా? అని మూతి విరుచుకోకండి. రాజకీయ నాయకుల వలె ఎలాంటి ఆధారాలు లేకుండా శాస్త్రవేత్తలు అభిప్రాయాలు వెల్లడించరు. కాబట్టి వారు అంటున్న విషయాల వెనక ఏదో ఒక అర్థం, పరిశోధన ఉండే ఉంటుంది. మరి ఆ పరిశోధన ఏంటి? ఇంతకీ వైరస్ ఎక్కడ పుట్టింది? తెలుసుకుందాం..

కరోనా వైరస్ పుట్టుక ఇప్పటికీ ఒక మిస్టరీలాగానే ఉంది. ప్రపంచమంతా చైనాను నిందిస్తున్నా అసలు నిజం కోసం పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజానిజాలు తేల్చుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా చైనా వెళ్లింది. కానీ ఈలోగా శాస్త్రోక్తంగా పరిశోధనలు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఒక నిజాన్ని బయటపెట్టారు. కరోనా వైరస్ కేవలం చైనా నుంచి పుట్టిందని ఆరోపించడం సబబుకాదని, అది ప్రపంచం మొత్తం మీద ఎప్పట్నుంచో ఉందని, కాకపోతే చైనాలో మొదటిసారిగా బయటపడిందని అంటున్నారు. మార్చి 2019లో స్పెయిన్‌లో సీవేజ్ వాటర్‌ను పరీక్షించిన తర్వాత అందులో కరోనా వైరస్ జాడలు ఉన్నట్లు వారు కనిపెట్టారు. సీవేజ్ సిస్టం, లావెట్రీల నుంచి ఈ వైరస్ ఫుడ్ ఫ్యాక్టరీలకు, మాంసం దుకాణాలకు పాకిందని డాక్టర్ టామ్ జెఫర్సన్ అన్నారు. అలాగే బ్రెజిల్, ఇటలీలోని సీవేజ్ వాటర్‌లో కూడా వైరస్ జాడలు కనిపించాయని, దీన్ని బట్టి చూస్తే చైనాలో బయటపడటానికి ముందే కరోనా వైరస్ ప్రపంచంలో ఉందని వారు రుజువు చేశారు.

అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది. ఏప్రిల్ 2019 నుంచి డిసెంబర్ వరకు అదే సీవేజ్ వాటర్‌లో ఎలాంటి వైరస్ జాడలు కనిపించకపోవడం కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. అయితే గతంలో స్పానిష్ ఫ్లూ విషయంలో కూడా ఇలాంటి వింత విషయాలే జరగడం ఈ పరిశోధనకు కొద్దిగా బలాన్నిస్తోంది. స్పానిష్ ఫ్లూ కూడా ఎలాంటి కాంటాక్టు లేనప్పటికీ దేశాలు దాటి ఎలా వెళ్లిందో ఇప్పటికీ తెలియలేదు. అంటే దీని ఆధారంగా కరోనా వైరస్ కూడా ఒక చోటి నుంచి మరో చోటికి వ్యాపించలేదు. ఆయా దేశాల్లో అప్పటికే ఆ వైరస్ ఉంది. కానీ బయటపడటం మాత్రం చైనాలో ముందుగా బయటపడిందని, అందుకే పేషెంట్ జీరోని గుర్తించడంలో విఫలమైనట్లు టామ్ జెఫర్సన్ వివరించారు. అంతేకాకుండా ఇది మానవులు ప్రయోగశాలల్లో తయారు చేసిన వదిలిన వైరస్ అంటూ వస్తున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. అలాగే కరోనాకు మూలం చైనా అనే ఆరోపణలు చేయడం సబబు కాదని సలహా కూడా ఇచ్చారు. దీని గురించి చైనా నిందలు మోయాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. ఏదేమైనా వైరస్ ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ, మంచిగా ఉన్న జీవితాలను తలకిందులు చేస్తోందని మాత్రం.. అనక తప్పని పరిస్థితి.

Advertisement