రెండువారాల్లో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్లు !

by Shyam |
రెండువారాల్లో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్లు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సిన్ పంపిణీ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ నుంచి తీపి కబురు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోంది. రెండు వారాల్లో టీకాలు అందే అవకాశం ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ బయోటెక్ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్’, పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్లు మాత్రమే వస్తాయని భావించారు. కానీ అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కూడా రాష్ట్రానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సోమవారం సమావేశమై వ్యాక్సిన్ వినియోగానికి ఎప్పటి నుంచి అనుమతి ఇవ్వాలి, ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి తదితరాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ పేరుతో వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నది హైదరాబాద్ నగరంలోనే అయినా కేంద్ర ప్రభుత్వ ఆమోదం మేరకే నిర్దిష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రానికి అందనుందని అధికారులు పేర్కొన్నారు. మూడు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు ఎంత మోతాదులో వస్తాయనేది కేంద్రం నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ మూడు రకాల వ్యాక్సిన్లు మైనస్ 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ప్లస్ 8 డిగ్రీల మధ్యలో నిల్వ ఉంచడానికి వీలు ఉన్నందున దానికి తగినట్లుగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా ఆ ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేసే వాక్-ఇన్-కూలర్లు, వాక్-ఇన్-ఫ్రీజర్లు, ఐస్ బేస్డ్ రిఫ్రిజిరేటర్లు, కోల్డ్ చైన్ సిస్టమ్ పరికరాలను సిద్ధం చేసుకుంటున్నారు. రెండు వారాల్లో రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా దశలవారీగా వ్యాక్సిన్ అందే అవకాశం ఉందని అధికారులు నమ్మకంతో ఉన్నారు.

Advertisement

Next Story