- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెడీగా ఉండండి.. అక్టోబర్‌లో థర్డ్ వేవ్?
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ అక్టోబర్ నెలలో చుట్టుముట్టవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న తరుణంలో లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేయడంపై తొందరపాటు వద్దని హెచ్చరించారు. మూడో వేవ్ ప్రభావాన్ని వీలైనంత తక్కువ చేయడానికి ప్రభుత్వాలు సన్నద్ధమవ్వాలని సూచించారు. ముందుగా అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ ప్రభావాన్ని కుదించడమే కాదు, దాన్ని నివారించడమూ సాధ్యపడవచ్చని వివరించారు. థర్డ్ వేవ్‌కు అడ్డుకట్ట వేయడంలో కరోనా టీకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. వచ్చే వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం వేస్తుందనే వాదనను కొట్టిపారేయలేమని, అదే జరిగితే వారి కోసం వైద్య వసతులూ అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ముప్పు మనదేశంలో మరో ఏడాదిపాటు కొనసాగే అవకాశముందని వివరించారు. ఈ నెలలో 40 మంది స్పెషలిస్టులు, వైద్యులు, సైంటిస్టులు, వైరాలజిస్టులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య నిపుణులతో రాయిటర్స్ సర్వే చేసి ఈ విషయాలను వెల్లడించింది.
చివరి నిమిషంలో ఏం చేయలేం
థర్డ్ వేవ్ విజృంభణ అంచనాలపై స్పందించిన 24 మందిలో 21 మంది నిపుణులు(దాదాపు 85శాతం) అక్టోబర్‌లో రావచ్చునని తెలిపారు. 21 మందిలోని ముగ్గురు ఆగస్టులోనే వస్తుందని చెప్పగా, 12 మంది సెప్టెంబర్‌లో రావచ్చునని వివరించారు. మిగిలిన ముగ్గురు నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మనదేశంలో ప్రారంభమవ్వచ్చని పేర్కొన్నారు. 70శాతం మంది నిపుణులు థర్డ్ వేవ్‌ను సెకండ్ వేవ్ కంటే సమర్థంగా నియంత్రించవచ్చునని అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్‌తో పాటు సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ సహజ వ్యాధి నిరోధకతలు ఇందుకు దోహదపడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. 18ఏళ్లలోపు పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంటుందా అన్న ప్రశ్నకు మూడింట రెండొంతుల మంది నిపుణులు ఔనని సమాధానమిచ్చారు. ‘ఒకవేళ పిల్లలకు అత్యధికులు కరోనాతో ఇన్ఫెక్ట్ అయితే, అందుకు మనం సిద్ధం కాలేదు. చివరి నిమిషంలో చేసేదేమీ ఉండదు. ఇదంతా పూర్తిగా ఒక భిన్నమైన సవాలు. దేశంలో పిల్లల కోసం పీడియాట్రిక్ ఐసీయూలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఇది ఉపద్రవంగా మారే ముప్పూ ఉన్నది’ అని డాక్టర్ దేవి శెట్టి వివరించారు.
రెండేళ్లలో హెర్డ్ ఇమ్యూనిటీ
కరోనా వైరస్ భవిష్యత్ వేరియంట్లు ప్రస్తుత టీకాల ప్రభావాన్ని తప్పించుకోలేవని మెజార్టీ నిపుణులు అభిప్రాయపడ్డారు. వైరస్ మరో ఏడాదికాలం ప్రజారోగ్య సమస్యగా ఉంటుందని తెలిపారు. ఇద్దరు నిపుణులు ఈ వైరస్ ఎప్పటికీ పోదని అన్నారు. కరోనా వైరస్ పరిష్కరించగలిగే సమస్యేనని, టీకాలతో అది సాధ్యమవుతుందని మేరీలాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ గాలో తెలిపారు. మరో రెండేళ్లలో భారతీయులు టీకాలు పొంది లేదా కరోనాకు ఎక్స్‌పోజ్ కావడం మూలంగా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చుననీ అంచనా వేశారు.