జిందగీ ఉల్టా పల్టా.. దేవుడా.. కుచ్ కరోనా!

దిశ, న్యూస్ బ్యూరో: ఏ ఇద్దరు కలిసినా కరోనా ముచ్చట్లే.. ఏ ఊర్లో చూసినా కరోనా కేసులే. ఏ రంగం భవిష్యత్ అయినా కరోనా మీదనే ఆధారం.. ఆఖరికి ప్రతి మనిషి జీవితం కరోనా వైరస్‌తోనే ముడిపడింది. ఇప్పుడు ఏ అంశం మీద ముచ్చటించుకున్నా కరోనాకు ముందు, తర్వాత అనే ప్రస్తావనే వస్తోంది. వైరస్ నియంత్రణకు టీకా వచ్చినా, డ్రగ్స్ అందుబాటులోకి వచ్చినా ఏ రంగం ఎట్లా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. కొన్ని వారాల క్రితం అందరిదీ బిజీ లైఫ్. ఇప్పుడేమో గడప దాటి బయటికి వెళ్లే పరిస్థితులు లేకుండా పోయాయి. రోజువారీ ప్రయాణాలకు బ్రేక్ వేసింది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో ప్రపంచమే అతలాకుతలం అవుతోంది. మరణాల సంఖ్య కూడా భయపెడుతోంది. ఇంకా ఎంత విషాదంలోకి నడిపిస్తుందో అర్థం కావడం లేదు. మొత్తంగా ప్రతి మనిషికి రేపటి గురించి అనిశ్చితిని గుర్తు చేస్తోంది. అందుకే కుటుంబం, స్నేహితులు, ఇష్టమైన వ్యక్తుల ఆరోగ్యం, రక్షణ పొందడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.

అయితే ఆర్థిక సమస్యలు ముంచెత్తుతున్నాయి. వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయి. కంపెనీలు మూత పడుతున్నాయి. దాంతో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా కన్నకలలు సాకారమవుతాయనుకున్న వేళ ఈ కరోనా భూతం పట్టుకుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని రోజులుగా ముద్ర వేసుకుంటున్నది. ఈ నాలుగు నెలల కరోనా కాలం అనేక మలుపులను తిప్పింది. ఇన్నాండ్లుగా ఊరించిన అదృష్టం చేతికందకుండా పోయింది. చేతికొచ్చిన జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్లకు అర్థం లేకుండా పోయింది. కొత్తగా ఆరంభిద్దామనుకున్న వ్యాపారాలకు దుర్ముహూర్తాలు మొదలయ్యాయి. లాభాల కోసం పెట్టుబడి పెడితే అసలుకే ఎసరొచ్చింది. ఇంట్లో పెండ్లిళ్లకు బ్రేకులు పడ్డాయి. ఫంక్షన్లకు ఎవర్నీ పిలవకుండానే చేసుకోవాల్సి వచ్చింది.

సొంత మనుషులు లేకుండానే వివాహాలు చేసుకుంటున్నారు. తండ్రి చనిపోయినా ఆఖరి చూపునకూ నోచుకోని దౌర్భాగ్యం నెలకొంది. తల్లి ఆసుపత్రిలో ఉంటే సేవ చేసే భాగ్యం లేకుండా పోయింది. కుటుంబంలో ఎవరైనా చనిపోతే మోసేందుకు నలుగురు రావడం లేదు. కరోనా వైరస్ ప్రతి మనిషి కలలను ఆవిరి చేసింది. ఓ ప్రముఖ పిడియాట్రిషియన్ సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని హయత్‌‌నగర్ ఏరియాలో ప్రధాన రహదారి వెంబడి పెద్ద భవంతిలో ఓ ఫ్లోర్‌ను కిరాయికి తీసుకున్నారు. మార్చి నెలాఖరుకు ఓపెన్ చేయాలని ఫర్నిచర్ కూడా చేయించారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన క్లినిక్‌ను తెరిస్తే నష్టాలే ఎదురవుతాయి. అందుకే నాలుగు నెలల నుంచి కిరాయి మాత్రం మీద పడుతున్నా ఆమె మాత్రం ఓపెన్ చేయలేదు. ఇలా అనేక మంది భవిష్యత్తు పునాదులపై కరోనా వైరస్ తాండవమాడుతోంది.

ఇప్పట్లో అంతే మరి..

పట్నం, పల్లె అనే తేడా లేకుండా వ్యాపిస్తోన్నకరోనా వైరస్‌తో ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితులే లేకుండా చేశాయి. ఫిబ్రవరితోనే మొదలైన కరోనా వైరస్ వ్యాప్తి అన్ని రంగాల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తోంది. విద్య, వ్యాపారం, ఉద్యోగం.. ఇలా ఎందులో ఉన్నవ్యక్తులపైన అయినా వైరస్ సోకకుండానే దాని ప్రభావాన్ని చూపిస్తోంది. మనిషి బలహీనతలను కూడా బయటపెట్టేస్తోంది. ఎవరు తట్టుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారన్న విషయంపై స్పష్టతనిస్తోంది. సాయం చేసే గుణగణాలను కలిగినోళ్లనూ వెలికి తీస్తోంది. సోషల్ మీడియాలో కాలక్షేపం చేయాల్సిన రోజులొచ్చాయి. సొంత మనుషులు దగ్గరున్నాపక్కనే కూర్చోలేని దుస్థితి తీసుకొచ్చింది. పక్కనుండే ప్రతి మనిషినీ అనుమానించాల్సిన రోజులివి. భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. ప్రస్తుతం వైరస్ సోకకుండా స్వీయ రక్షణకే అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్యత తలెత్తింది.

కమీషన్ పాయే..

నార్సింగికి చెందిన రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ ఏజెంటు. లైఫ్ సెటిల్ కావాలని జనవరి, ఫిబ్రవరి నెలల్లో బాగా కష్టపడ్డాడు. పెద్ద ప్లాట్ల విక్రయానికి అగ్రిమెంటు కుదిర్చాడు. 45 రోజుల్లో రిజిస్ట్రేషన్. ఇక రూ.20 లక్షల వరకు కమీషన్ తన సొంతం. అందుకే కాస్త రియల్ ఎస్టేట్‌లో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. ఇక కష్టాల్లేకుండా బతికేయొచ్చు అనుకున్నాడు. ఇంతలోనే పిడుగులాంటి వార్త వచ్చింది. కరోనా భూతం పట్టింది. తన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. తన ఆశలన్నీ అడియాశలుగా మిగిలాయి.

ఒక్క రోజు ఉద్యోగం..

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్‌కు చెందిన రమేష్ ఎంటెక్ చదివాడు. మూడేండ్ల పాటు ఉద్యోగం కోసం తిరిగాడు. అన్నీ వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ఈ తరుణంలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు పడ్డాయి. ఇక ఈసారి ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో ప్రిపేరయ్యాడు. కొద్ది రోజులకే పోలారిస్ ఐటీ కంపెనీ నుంచి కాల్ లెటర్ వచ్చింది. మంచి ప్యాకేజీ. ఇన్నేండ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కిందనుకున్నాడు. మార్చి 20న ఉద్యోగంలో చేరమన్నారు. వెంటనే చేరాడు. మరుసటి రోజే లాక్‌డౌన్.. అంతా వర్క్ ఫ్రం హోం.. ఇతడికేమో వర్క్ ఇవ్వలేదు. ఇప్పుడే చేరావు కదా.. లాక్‌డౌన్ తర్వాత రమ్మని మేనేజ్‌మెంట్ చెప్పింది. ఒక్క రోజులోనే తన కల ఆవిరయ్యింది. ఇప్పుడు తన ఉద్యోగం ఉన్నట్టా? లేనట్టా? తనకే తెలియడం లేదు.

ఉల్టా పల్టా

ఊరి నుంచి ఇక్కడికొచ్చాడు చంద్రశేఖర్. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. కానీ రాత్రి, పగలు తేడా లేకుండా పని. ఇది నచ్చలేదు. ఉద్యోగానికి రిజైన్ చేశాడు. కొండాపూర్‌లో ఓ చిన్నపాటి షోరూంకి సరిపడా స్పేస్‌ని కిరాయికి తీసుకున్నాడు. యజమానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఆర్గానిక్ స్టోర్ నిర్వహణ కోసం ఇంటీరియర్ డెకరేటర్స్ పని సగం పూర్తయ్యింది. దీనికంతటికి రూ.లక్షల్లోనే ఖర్చయ్యింది. మార్చి 23న ఓపెన్ చేద్దామని ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. అందరికీ ఆహ్వానం పలికాడు. ఇక మరుసటి రోజే ఆర్గానిక్ స్టోర్‌కు అవసరమైన సామగ్రి వచ్చేస్తోంది. ఇంతలోనే లాక్‌డౌన్.. ఇక చెప్పేదేముంది? అంతా బూడిదలో పోసినట్లయ్యింది. యజమాని అడ్వాన్స్ ఇవ్వనన్నాడు. ఇంటీరియర్ డెకర్స్‌కు పెట్టిన డబ్బులు గోడకు వేసిన సున్నంలా వెక్కిరిస్తోంది. చేసే ఉద్యోగం పోయింది. తోటి వాళ్లంతా వర్క్ ఫ్రం హోంతో హాయిగా ఉన్నారు. వేసిన ఒక్క అడుగుతో సీను రివర్స్ అయ్యింది.

హోటల్.. కనుమరుగు

గుజరాత్‌లో ఓ హోటల్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. పెద్ద స్థలం.. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. పల్లె సెట్టింగు. భోజనం కూడా ఇంటి భోజనం మాదిరిగానే ఉంటుంది. ఇంట్లో ఎలాగైతే కూర్చుంటామో అక్కడా అట్లే. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు, మంత్రులు కూడా అక్కడికి వచ్చి తృప్తిగా భోజనం చేస్తారు. అలాంటి హోటల్ పెట్టాలనుకున్నాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. రాష్ట్రంలోనే ఓ ప్రముఖ స్వీట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. హైదరాబాద్ శివార్లలో స్థలం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో తన సొంత జిల్లాకు వెళ్లిపోయాడు. మచిలీపట్నంలో స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా సెట్టింగ్ వేశాడు. రోట్లో కారం దంచడం మొదలుకొని కట్టెల పొయ్యి మీద వండేందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్నాడు. వంట చేసే వాళ్లను, పనివాళ్లను నియమించుకున్నాడు. ముహూర్తం ఖరారైంది. మరుసటి రోజే లాక్‌డౌన్.. ఇంకేముంది? ఇప్పుడు లాక్‌డౌన్ నిబంధనలను సడలించినా ప్రజలు హోటళ్లకు వచ్చే పరిస్థితులు లేవు. దాంతో ఏర్పాటుకైన రూ.లక్షలు ఆవిరయ్యాయి. తను కన్న కల ఆవిరైంది.

టూర్.. వాయిదా

పదేండ్ల నుంచి ఒక్కసారైనా విదేశీయానం చేయాలని ఎల్బీనగర్‌కు చెందిన లింగస్వామి కలలు కన్నాడు. ఈ ఏడాది రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి రావడంతో కాస్త చేతికి డబ్బులు అందాయి. భార్యాపిల్లలను ఈ వేసవిలో దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. పిల్లలకు ఎగ్జామ్స్ పూర్తి కాగానే అన్నీ రెడీ చేసుకున్నాడు. ఎవరికి వాళ్లు ఏమేం చూడాలి? ఏమేం షాపింగ్ చేయాలో లిస్టు కూడా తయారు చేసుకున్నారు. టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అక్కడ ఉండేందుకు హోటల్ కూడా బుక్ చేసుకున్నారు. అంతే.. ఏక్ దమ్ కరోనా వైరస్ రావడంతో ఎన్నో ఏండ్ల నుంచి కన్న కలలకు బ్రేకులు పడ్డాయి.

ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు రాసుకున్న2020 డైరీ

జనవరి: కొత్త సంవత్సరం 2020. ఈ ఇయర్ నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యాలి.
ఫిబ్రవరి: గూగుల్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. ఇక లైఫ్ టర్న్ అవ్వుద్ది.
మార్చి: మార్చి 2. మొదటి రోజు. పెద్ద క్యాంపస్. మైండ్ బ్లోయింగ్ బిల్డింగ్, లైఫ్ స్టైల్ మార్చాలి. స్టేటస్‌కు తగ్గట్లు దిల్‌సుఖ్‌నగర్ నుంచి గచ్చిబౌలికి షిఫ్ట్ అవ్వాలి. టియాగొ కారు తీసేసి హోండా వెర్నా తీసుకోవాలి.
మార్చి 22: వర్క్ ఫ్రం హోం. ఫ్రీ టైం ఉంటది, డ్రాయింగ్స్ వేసుకోవచ్చు, పాటలు రాసుకోవచ్చు. కొత్త పుస్తకాలు చదవచ్చు. ఫుల్ హ్యాపీ.
ఏప్రిల్: ఫుల్ డే ఆఫీసు వర్క్. వీడియో కాల్స్, మీటింగ్స్.
మే: పని ఒత్తిడి, కొత్త మానిటరింగ్. కొత్త పని విధానం. ప్రతి క్షణం అప్రమత్తం. ప్రతి ఫోన్ కాల్ రిసీవింగ్.
జూన్: మళ్లీ ఆఫీసు తెరిస్తే బాగుండు. ఎప్పుడు పోతుందిరా దేవుడా.. ఈ కరోనా?
జూలై: వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందిరా బాబూ.. అదొస్తేనన్న కాస్త బయట తిరగొచ్చు.
(ప్రతి ఒక్కరి డైరీ కాస్త అటుఇటుగా ఇట్లనే ఉన్నది)

బలహీనతలు బయట పడ్డాయి : చేగొండి చంద్రశేఖర్, డైరెక్టర్, నటుడు

కరోనా వైరస్ మనిషిలోని బలహీనతలను బయట పెట్టాయి. ఎవరు ఎంత మేరకు తట్టుకుంటారో స్పష్టం చేస్తోంది. సమాజాన్ని భయపెట్టిస్తోంది. అలాగే కష్టాల్లో ఉన్న సమాజాన్ని ఆదుకునే వారిని తయారు చేసింది. దానధర్మాలను చేసేందుకు పురిగొల్పింది. సాయపడే గుణాన్ని అలవర్చింది. అందుకే ఇప్పుడు చాలా మంది ఆపదలో ఉన్నోళ్లను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. లాక్ డౌన్, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కుటుంబాల అవసరం తెలిసొచ్చింది. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో కూడా నేర్పింది.

చెదిరిన కలలు: పైడిమర్రి, సేవ్ ఫౌండేషన్ ప్రతినిధి

కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో ప్రతి మనిషి జీవితంలో మర్చిపోలేని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కలలు చెదిరిపోతున్నాయి. ఎంతో మంది వారు చేద్దామనుకున్న పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఇంకొందరు పూర్తిగా విరమించుకుంటున్నారు. కరోనాతో అనేక రంగాలు కుదేలయ్యాయి. వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. రోడ్డున పడుతున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితులెప్పడూ చూడలేదు.

Advertisement