సరిహద్దుల్లో కాపు కాశారు.. కరోనా బాధితుడిని పట్టేశారు

by srinivas |
సరిహద్దుల్లో కాపు కాశారు.. కరోనా బాధితుడిని పట్టేశారు
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో క్వారంటైన్ చేశారు. వైద్య పరీక్షలూ జరిపారు. వైరస్ లేదని తేల్చారు. డిశ్చార్జ్ అయిన వ్యక్తి యథావిధిగా తన కార్యకలాపాల్లో మునిగిపోయారు. కానీ, ఆయన నుంచి సేకరించిన రెండో శాంపిల్‌లో కరోనా పాజిటివ్ అని తేలింది. చివరికి బాధితుడి ఫోన్ ట్రేసింగ్ చేసి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకుని గాంధీ దవాఖానకు తరలించారు. ఈ సంఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణ జిల్లా నూజివీడుకు చెందిన ఓ వ్యాపారిని కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. ఆయన నుంచి సేకరించిన శాంపిల్స్ నెగెటివ్ రావడంతో 14 రోజులు తర్వాత ఇంటికి పంపించారు. ఆ సమయంలో మరోసారి శాంపిల్స్ సేరించారు. ఇంటికి వెళ్లిన వ్యాపారి మామిడికాయల లోడు తీసుకొని లారీలో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్లారు. అక్కడ మామిడికాయలను విక్రయించి వచ్చేటప్పుడు ఉల్లిగడ్డలు లోడ్ చేసుకుని తిరిగి నూజివీడుకు బయల్దేరారు. కానీ, ఈ మధ్యకాలంలో వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడే విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి నుంచి రెండోసారి తీసుకున్న శాంపిల్స్‌లో కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. సదరు వ్యాపారి ఫోను‌ను ట్రేసింగ్ చేయగా తెలంగాణ మీదుగా నూజివీడుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని బెల్‌తరోడా పోలీసు చెక్‌పోస్టుకు వైద్యులు చేరుకున్నారు. వ్యాపారి వస్తున్న లారీని గుర్తించి నిలిపివేశారు. ఆయనకు విషయం తెలిపి 108లో సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. వ్యాపారితోపాటు ఉన్న లారీ డ్రైవర్‌ను నిర్మల్‌లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా సోకిన వ్యాపారిని గాంధీ దవాఖానకు తరలించిన విషయం ఏపీ అధికారులు తెలిపామని నిర్మల్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

Tags: coroan virus,Nirmal collector,merchant,corona positive,Gandhi Hospital

Advertisement

Next Story

Most Viewed