17లక్షలకు కరోనా కేసులు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభన మరింత తీవ్రమయింది. ఒక్క రోజులో నమోదయ్యే కొత్త కేసులు వరుసగా మూడో రోజు 50 వేల మార్కు దాటాయి. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24గంటల్లో 57,117 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఒక్క రోజులో నమోదయ్యే కేసుల సంఖ్య ఇదే అత్యధికమవడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 16,95,988కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి వివిధ రాష్ట్రాల కేసుల బుల్లెటిన్‌లు వెలువడడంతో ఈ సంఖ్య 17లక్షలు దాటింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే 764 మంది మరణించారు. దీంతో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 36,569కి చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారిలో 10 లక్షల94వేల మంది కోలుకోగా ప్రస్తుతం 5లక్షల65వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా కేసుల రికవరీ రేటు 64.53 శాతంగా ఉండగా మరణాల రేటు 2.15 శాతంగా ఉంది.

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో మాత్రం గతంతో పోలిస్తే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా నమోదైన 1118 కొత్త కేసులతో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు చేరింది. ఇక్కడ కొత్తగా 26 కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3,989 మంది వైరస్ బారినపడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులో 9,601 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 4,31,719కి వెళ్లింది. 24గంటల్లో వైరస్ బారినపడి 322 మంది చనిపోగా మొత్తం మరణాలు 15,316కు చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 5879 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,51,738కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 99మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4034కు చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు 62,574 కేసులకుగాను 2465 మంది మృత్యువాత పడడం కలవరం కలిగిస్తోంది. ఏపీలో గడిచిన 24గంటల్లో 9,276కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,209కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 58 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1407మంది మృత్యువాత పడ్డారు.

Advertisement