గాంధీలో కరోనా పేషంట్ మిస్సింగ్

by vinod kumar |
గాంధీలో కరోనా పేషంట్ మిస్సింగ్
X

దిశ, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి కన్పించకుండా పోయిన ఘటన మరొకటి చోటు చేసుకుంది. గతంలో వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ తన భర్త కన్పించడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంఘటన తెలిసిందే. ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. దూల్‌పేట్ జిన్సీ చౌరాయ్ ప్రాంతానికి చెందిన నరేష్‌సింగ్ కరోనా అనుమానిత లక్షణాలతో గత నెల 30న కింగ్ కోఠి ఆస్పత్రికి తల్లితో కలిసి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో అతనికి ఆక్సిజన్ ఎక్కించిన వైద్యులు తల్లిని ఇంటికి వెళ్లమని చెప్పి నరేష్‌సింగ్ ను అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తన సోదరుడు ముఖేష్ సింగ్‌కు ఫోన్ చేసి గాంధీ ఆస్పత్రిలో ఉన్నానని, ఎవరూ తనను పట్టించుకోవడం లేదని నరేష్ సింగ్ చెప్పాడు. నరేష్ సింగ్ నెల 2న చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లి విచారిస్తే అతని ఆచూకీ దొరకలేదు. కనీసం రికార్డుల్లో కూడా పేరు లేదని, వైద్యులు, సిబ్బంది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అతని సోదరుడు ముఖేష్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశామని, తన సోదరుడి ఆచూకీ వెంటనే తెలపాలని, లేని పక్షంలో హై‌కోర్టులో ఫిర్యాదు చేస్తామని ముఖేష్ సింగ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed