బంధాలు, బంధుత్వాలకు కరోనా కండిషన్స్..!

by  |
బంధాలు, బంధుత్వాలకు కరోనా కండిషన్స్..!
X

దిశ‌, అందోల్: కరోనా.. ఈ పేరు వింటే ప్రస్తుతం భయపడని వారు లేరు. మనుషుల మధ్య దూరం పెంచి ఒకరిని ఒకరు కలవకుండా చేసింది ఈ వైరస్.. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. పలువురు మృతి చెందారు. దీని కారణంగా ఎవరింటికైనా వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఇక పండుగలు, శుభాకార్యాలకైతే వెళ్లలేని పరిస్థితి. దీని వల్ల బంధాలన్నీ బందీలుగా మారాయి. బంధువుల‌ను చూడాల‌నిపిస్తే వీడియో కాల్‌.. మాట్లాడాల‌నిపిస్తే ఆడియో కాల్ చేస్తూ కాలం గడుపుతున్నారు. దాదాపుగా 5 నెలలుగా ఇదే ప‌రిస్థితి. అంద‌రూ ఒకేచోట కలుసుకున్నప్పుడు క‌నిపించే సంద‌డి క‌నుమ‌రుగైంది.

కనిపించని పండుగ వాతావరణం..

ఒకప్పుడు ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా పండుగ చేసినా చిన్న బంధువులతో ఈ ఇల్లు కళకళలాడేది. కానీ ప్రస్తుతం అలాంటి సందడి వాతావరణం కనిపించడం లేదు. పెండ్లిళ్లకు సైతం ఎవరూ రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ వారు లేకుండానే ఫంక్షన్‌లు కానిస్తూ బాధపడుతున్నారు ప్రజలు.

ఫోన్‌లోనే కబుర్లు..

క‌రోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆత్మీయులు, బంధువులు ఇండ్లకు ఎవరూ వెళ్లడం లేదు. కేవలం ఫోన్‌లోనే మాట్లాడుకుంటూ గడిపేస్తున్నారు. వీడియో కాల్స్ ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ ఆనందిస్తున్నారు. పెండ్లయి మెట్టింటికి వెళ్లిన తొబుట్టువులు, ఎక్క‌డెక్క‌డో దూర ప్రాంతాల్లో స్థిర‌ప‌డిన, విదేశాల్లో చిక్కుపోయిన బంధువులు తామంతా ఎప్పుడెప్ప‌డు క‌లుసుకుంటామోన‌ని బెంగ‌తో ఉన్నారు.

కడసారి చూపుకు దూరమవుతూ..

శుభ కార్య‌ల‌కు వెళ్ల‌క‌పోయినా సరే.. కానీ ఎవ‌రైనా తెలిసిన వారు చనిపోతే చివ‌రి చూపు చూసేందుకు వెళ్తాం. కానీ క‌రోనా వ‌ల‌న ఆత్మీయులు, బంధువులు, చివరికి కుటుంబసభ్యులు చనిపోయినా అనుమానాలతో వారి దగ్గరికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందిద. ఇటీవ‌లే క‌రోనా వల్ల టేక్మాల్ మండ‌లానికి చెందిన ఓ రాజ‌కీయ నేత చ‌నిపోతే, అత‌ని కుటుంబ స‌భ్యులు సైతం దూరంగా నిలబడ్డారు. అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు.

సుట్టాలు లేకుండానే…20 మందితోనే పెండ్లి చేసినం..

మే 14న నా బిడ్డ పెండ్డి చేసినం. కరోనా కారణంగా సుట్టాలను పిలువలేదు. 20 మంది మాత్రమే పెండ్లిలో ఉండాలని అధికారులు చెప్పడంతో ఎవరూ రాలేదు. పెండ్లి పత్రికలు 11 కొట్టించి, సుట్టాలకు ఫోన్ చేసి చెప్పినం. అక్కడి నుంచి ఆశీర్వదించమని కోరినం.

– గడ్డ మీది సాయిలు, జోగిపేట

ఎక్కడికీ పోవడం లేదు..

కరోనా కారణంగా ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇండ్లకే పరిమితమయ్యాం. బంధువుల వారి రాకపోకలు తగ్గాయి. ఇతరుల ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఎవరిని పిలువకుండానే ఫంక్షన్‌లు చేసుకుంటున్నాం.

– విజయలక్ష్మి, బీరంగూడ


Next Story

Most Viewed