కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా దందా

by  |
కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా దందా
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ పేదలకు, ప్రజలకు కష్టాలు తెచ్చిపెడితే ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. దీపముండగానే తరహాలో రోగుల కష్టాలే వారికి అడ్వాంటేజ్‌గా మారుతోంది. వారి దోపిడీకి అడ్డూ ఆపూ లేదు. మందులే లేని కరోనా వ్యాధికి చికిత్స పేరుతో లక్షలాది రూపాయలు దండుకుంటున్నాయి. చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చడం జీవన్మరణ సమస్యగా మారుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో కేవలం కరోనా చికిత్స కోసం చేసిన అప్పును తీర్చడానికి మార్గం లేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.

కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్దిష్టంగా ఏ వార్డులో ఎంత ఛార్జీలు వసూలు చేయాలో ఏకంగా ఒక జీవోనే జారీ చేసింది. అయినా అది ప్రైవేటు ఆసుపత్రులకు లెక్కేలేదు. ఇష్టారీతిలో ఛార్జీలు వసూలు చేసిన రెండు ఆసుపత్రులపై ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంది. అయినా కార్పొరేట్ ఆసుపత్రుల దందా ఆగడం లేదు. ‘అన్నిఆసుపత్రులూ ఇలాగే వసూలు చేస్తున్నాయి. మా ఒక్క ఆసుపత్రిపైనే ఇలాంటి చర్యలెందుకు? తప్పకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తాను’ అని డెక్కన్ ఆసుపత్రి జనరల్ మేనేజర్ చేసిన వ్యాఖ్యలతో ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే స్పాట్‌లోనే ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు పోలీసులు. కానీ పేషెంట్ల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నా మీనమేషాలు లెక్కిస్తూ చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం తటపటాయిస్తోంది. దర్యాప్తులు, నివేదికల పేరుతో తాత్సారం చేస్తోంది. చివరకు ప్రజల ఆగ్రహం పెల్లుబికితే ఎపిడమిక్ యాక్ట్ పెట్టి తాత్కాలికంగా కరోనా చికిత్స చేయడానికి ఇచ్చిన అనుమతిని మాత్రం రద్దు చేసి ఊరుకుంటోంది. కానీ ఇతర చికిత్సల దోపిడీ మాత్రం ఆగడం లేదు

హోటల్ మెనూ లాగా ఛార్జీల పట్టిక

ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ఏకంగా ఒక జాబితానే తయారుచేసి అడ్మిట్ అయ్యే పేషెంట్లకు చూపిస్తున్నాయి. కనీసంగా పది లక్షల రూపాయలతో మొదలవుతుంది ఈ ఆసుపత్రుల దందా. ప్రభుత్వం నిర్దిష్టంగా ఏ వార్డులో ఎంత వసూలు చేయాలో చెప్పినా వీటికి లెక్కే ఉండదు. సనత్‌నగర్‌లోని ఒక ఆసుపత్రి ఏకంగా హోటల్ మెనూ తరహాలో లిస్టునే తయారుచేసింది. రోజుకు 13 పీపీఈ కిట్లు వాడతామని, ఒక్కో కిట్‌కు రూ.1100 వంతున రోజుకు రూ.14,300 ఖర్చవుతుందని చెప్పింది. కరోనా టెస్టుకు ఎంత వసూలు చేయాలో చెప్పినా ఆ ఆసుపత్రి మాత్రం రూ.3,500 ఖరారు చేసింది. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు పేషెంట్‌కు వాడే బీపీ మిషన్, పల్స్ ఆక్సీ‌మీటర్, థర్మామీటర్ లాంటివాటికి రూ.5,000 ఖరారు చేసింది. ఆక్సిజన్ అవసరం లేకుండా జనరల్ వార్డులో రూ.4,500 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఛార్జీని నిర్ణయించినా ఈ ఆసుపత్రి మాత్రం పది రెట్లు పెంచి రోజుకు రూ.45,000 ఖరారు చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఈ ఆసుపత్రికీ పట్టదు. ఫిర్యాదు లేకుండా చర్యలు ఎలా తీసుకోగలం అంటూ ప్రభుత్వ అధికారులూ చోద్యం చూస్తూ ఉంటారు. కొన్ని ఆసుపత్రులు ముందుగానే ధరల పట్టిక పెడితే మరికొన్ని ఆసుపత్రులు మాత్రం పరీక్షలు, కొత్త రోగాలు, డాక్టర్ల ఫీజుల పేరుతో రోజుకు సగటున లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ టైమ్‌లోనే లక్షల రూపాయలు డిపాజిట్/అడ్వాన్స్ పేరుతో చెల్లించాలి. ఒకవేళ వెంటిలేటర్ అవసరమైతే మళ్లీ లక్షల రూపాయలు కట్టాలి. ఇదంతా అడ్వాన్స్ మాత్రమే. వీటి వినియోగానికి మళ్లీ రోజువారీ చెల్లించక తప్పదు. ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగానికి ఏ మాత్రం పట్టదు. సర్కారు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం చేయించుకోవచ్చుగదా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాల్సిన పనేముంది అంటూ మంత్రులు, అధికారులు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు.

యశోదా ఆసుపత్రి మినహాయింపేమీ కాదు

కిడ్నీసమస్యతో బాధపడుతూ నడుచుకుంటూ వెళ్లి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరిన కోరుట్లకు చెందిన రాజశేఖర్ అనే యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటికే రూ.నాలుగు లక్షలు ఖర్చయింది. పేద కుటుంబానికి చెందిన ఇతని చికిత్సకు అప్పులు చేసి మరీ ఆ డబ్బు కట్టారు. ఐదు రోజులుగా కొడుకును చూడనేలేదని, ఎలా ఉన్నాడో తెలియదని, రోజుకు లక్ష రూపాయల చొప్పున ఖర్చవుతుందంటూ ఇంకో ఆరు లక్షలు చెల్లిస్తే పేషెంట్‌ని చూపిస్తామంటూ డాక్టర్లు చెప్తున్నారని పేషెంట్ తల్లి వాపోయింది. అప్పు చేసినా ఆరు లక్షలు పుట్టే మార్గం లేకపోవడంతో అసలు తన కొడుకు బతికే ఉన్నాడా అనే అనుమానంతో ఆమె ఆసుపత్రి ఆవరణలోనే డాక్టర్ల బలవంతపు వసూళ్లపై నిరసన గళమెత్తారు. చివరకు ఇది మీడియాకు చేరడంతో ఆరు లక్షలు కట్టాల్సిన అవసరం లేదంటూ చికిత్సను మధ్యలోనే ఆపివేసి కోమాలో ఉన్న యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి అంబులెన్సులో కోరుట్లకు తరలించారు.

కరోనా నెగెటివ్ వచ్చినా పాజిటివ్ వార్డులో

కరోనా లేకపోయినప్పటికీ పాజిటివ్ ఉందంటూ ఐసొలేషన్ వార్డులో పెట్టి చికిత్స చేసిన డెక్కన్ ఆసుపత్రి నిర్వాకంపై ఏకంగా బాధితుడు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు. చివరకు ఆసుపత్రి దోపిడీ వెలుగులోకి వచ్చింది. అదే వరుసలో విరించి ఆసుపత్రిపైనా ఫిర్యాదులు వచ్చాయి. అంతకుముందు గచ్చిబౌలిలోని ఒక ఆసుపత్రిపైనా ఇలాంటి ఫిర్యాదులే వచ్చినా ఐఎంఏ ద్వారా చివరకు వివాదాస్పదం కాకుండా డాక్టర్లు జాగ్రత్తపడ్డారు. కరోనా పాజిటివ్ అని రిపోర్టు వస్తే పేషెంట్‌కు నరకం కనిపిస్తుంది. కానీ కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రం మంచి బేరం దొరికిందనుకుని రోజుల తరబడి ఆసుపత్రిలోనే చికిత్స పేరుతో ఉంచి లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నాయి.

ఆసుపత్రుల దోపిడీపై హైకోర్టు సైతం ఆగ్రహం

కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధరకు భూములు పొంది పేదలకు ఉచిత వైద్యం చేయకపోవడంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయంటూ విశ్రాంత ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం జరిగిన విచారణ సందర్భంగా పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతుతో ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందని గుర్తుచేశారు. పై రెండు ఆసుపత్రులూ ఉచిత వైద్యం ఇవ్వలేదని వాదించారు. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహాలను కూడా అప్పగించడంలేదని హైకోర్టు ఈ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.

నగదు చెల్లింపులైతేనే..

కొన్ని కార్పేరేటు, ప్రైవేటు ఆసుపత్రులు నగదు రూపంలో మాత్రమే ఛార్జీలను తీసుకుంటున్నాయి. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ చెల్లింపులను ఒప్పుకోవడం లేదు. నగదు రూపంలో మాత్రమే తీసుకుంటామని షరతు పెడుతున్నాయి. ఇలా జరిగే చెల్లింపులేవీ పన్ను పరిధిలోకి వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎలాగూ కరోనా చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్సు కార్డులను ఒప్పుకోవడం లేదు. పైగా పేషెంట్ డిశ్చార్జి అయ్యే సమయంలో సమ్మరీతో పాటు ఏయే సేవకు ఎంత ఖర్చయిందో వివరాలతో కూడిన బిల్లును ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈ బిల్లులు చివరకు మీడియా చేతికి చిక్కుతున్నాయన్న పేరుతో తెల్లకాగితం మీద మాత్రమే రాసి ఇస్తున్నారు. ఆసుపత్రుల దోపిడీ ఎక్కడా ఆధారాలకు దొరకకుండా జాగ్రత్తపడుతున్నాయి.


Next Story

Most Viewed