పరేషాన్‌లో పరిశ్రమలు.. కారణం ఒక్కటే!

by Shyam |
పరేషాన్‌లో పరిశ్రమలు.. కారణం ఒక్కటే!
X

కరోనా వైరస్ ఎంస్ఎంఈలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆర్డర్లు లేకపోవడంతో ఉత్పత్తులు నిలిచిపోయాయి. పేరుకున్న నిల్వలకు మార్కెట్ లేదు. కొత్త వస్తువులకు డిమాండ్ లేదు. పరిశ్రమలకు ఉన్న బ్యాంకు నిల్వలు గడిచిన మూడు నెలల ఖర్చులకే ఆవిరయ్యాయి. మరో వైపు ఈఎంఐలు కట్టాల్సిందేనంటూ బ్యాంకర్లు ఒత్తిళ్లు చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీ చిన్న పరిశ్రమలకు ఏమాత్రం ఊతమివ్వడం లేదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. రుణాలు చెల్లించకపోతే ఎన్పీఏ జాబితాలో చేరుస్తామంటూ బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, న్యూస్ బ్యూరో: ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ చిన్న పరిశ్రమలకు ఊతమివ్వడం లేదు. సవాలక్ష కారణాలతో దరఖాస్తులన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ప్యాకేజీ మొత్తం రూ.20,97,053 కోట్లు. ఇందులో ఎంఎస్ఎంఈలు, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల కోసం రూ.3,00,000 కోట్లు. ఆర్థిక ఇబ్బందులో ఉన్న‌ ఎంఎస్ఎంఈల కోసం రూ.20,000 కోట్లు. ఎంఎస్ఎంఈ ఫండ్స్ కోసం రూ.50,000 కోట్లుగా ప్రకటించారు. వర్కింగ్ క్యాపిటల్ పై రూ.20 శాతం వరకు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఆ ప్యాకేజీ పెద్దగా ఉన్నా లెక్కలు తీసి అంచనా వేస్తే తెలంగాణ రాష్ట్రానికొచ్చేది రూ.12 వేల కోట్లే. ఇక్కడున్న పరిశ్రమల సంఖ్య 45 వేలు. అంటే సగటున ఒక్కో పరిశ్రమకు వచ్చేది రూ.2.50 లక్షలు మించవన్న మాట.. మూడు నెలల లాక్డౌన్తో కోల్పోయిన మార్కెట్, నష్టం ముందు లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి దక్కేది నామమాత్రమే. అయితే అది కూడా ఉదారంగా ఇవ్వాల్సిన బ్యాంకర్లు అనేక కారణాలు చూపించి మొండికేస్తున్నారని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు.

కుంటిసాకులతో రిజెక్ట్..

– నరేందర్కు ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీ ఉంది. ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద రుణం తీసుకుందామని దరఖాస్తు చేసుకున్నాడు. గతంలో సరిగ్గా కట్టలేదంటూ తిరస్కరించారు. రూ.కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ రుణం ఇవ్వలేమంటూ తిప్పి పంపారు. డిఫాల్టర్ అంటూ ముద్ర వేశారు.
– కిరణ్ది విద్యుత్తు పరికరాలు తయారు చేసే కంపెనీ. లాక్డౌన్ నష్టాల నుంచి విముక్తి పొందొచ్చునని రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ మీ భార్య పేరిట ఉన్న క్రెడిట్ కార్డు బిల్లు రూ.5 వేలు ఎగ్గొట్టారంటూ కారణాన్ని చూపి దరఖాస్తును రిజెక్ట్ చేశారు. ఐతే ఆయన భార్యకు ఏ క్రెడిట్ కార్డూ లేదని దరఖాస్తుదారుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇలా రాష్ట్రంలోని వేలాది ఎంఎస్ఎంఈలకు బ్యాంకర్ల నుంచి ఎదురవుతోన్న ఇబ్బందులని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రతినిధులు వివరించారు.

తడిసి మోపెడయ్యింది : మర్రి ప్రభాకర్ రావు, ఆలిండియా ఎంఎస్ఎంఈ ఫోరం కన్వీనర్

లాక్​డౌన్​ కాలంలో వేతనాలు, కిరాయిలు, కరెంటు బిల్లుల ఖర్చు తడిసి మోపెడయ్యింది. వర్కింగ్ క్యాపిటల్ పై 20 శాతం రుణాలిచ్చే పథకమేం కొత్తది కాదు. పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇవ్వాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ లోనే ఉంది. కానీ బ్యాంకులు సాకులు చెబుతున్నాయి. ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ఎంఎస్ఎంఈలకు ఊతమివ్వడం లేదు.

సగం కంపెనీలు తెరుచుకోలే: ఎం.గోపాలరావు, టిఫ్ కార్యదర్శి

లాక్డౌన్ ప్రభావం చిన్న కంపెనీలపై ఎక్కువగా ఉంది. సగం కంపెనీలు నేటికీ తెరచుకోలేదు. వలస కార్మికులు వెళ్లిపోయారు. స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరకడం లేదు. ఈఎంఐల పేరిట బ్యాంకుల వేధింపులు ఆపాలి. ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ రుణాలు పెద్ద కంపెనీలకే దక్కాయి. ఎంఎస్ఎంఈలకు సాయం అందించాలి.

Advertisement

Next Story

Most Viewed