కరోనా భయం.. దొరకని అభయం!

by  |
కరోనా భయం.. దొరకని అభయం!
X

దిశ, న‌ల్లగొండ: క‌రోనా భ‌యం జిల్లా ప్రజ‌ల‌ను వెంటాడుతుండటంతో ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాలో వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. ఈ ప్రభావంతో చేనేత‌, వ్యవ‌సాయం, పౌల్ర్టీ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. యాద‌గిరిగుట్ట శ్రీ‌ల‌క్ష్మిన‌ర్సింహ్మస్వామి తదితర దేవాల‌యాలన్నీ భ‌క్తులు లేక వెల వెలబోతున్నాయి. సూర్యాపేట‌, భువ‌న‌గిరి, న‌ల్లగొండ జిల్లా కేంద్రాల్లోని షాంపింగ్ మాల్స్‌ సంద‌డి లేక బోసిపోయాయి. భువ‌న‌గిరి ఖిల్లాపైకి ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించ‌డంలేదు. రాష్ట్ర ప్రభుత్వం క‌రోనా క‌ట్టడికి ముందు జాగ్రత్త చ‌ర్యగా విద్యాసంస్థల‌కు ఈ నెల 31 వ‌ర‌కు సెల‌వులు ప్రక‌టించిన విషయం తెలిసిందే. కానీ, ఈ విద్యా సంవత్సరంలో వరుస ఎన్నికలు, ఆర్టీసీ సమ్మెతోపాటు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వచ్చిన సెలవులు విద్యార్థుల చ‌దువుల‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

భక్తులు వెలవెల‌..

తెలంగాణ తిరుమ‌ల‌గా పేరు గాంచిన యాద‌గిరిగుట్ట శ్రీ‌లక్ష్మిన‌ర్సింహ్మస్వామి దేవాలయానికి వీకెండ్‌లో 50 వేలమంది భ‌క్తులు రావాల్సి ఉండ‌గా.. ఈ వీకెండ్‌లో భక్తులు 30 వేలకు మించి రాలేదని దేవ‌స్థాన అధికారులు చెబుతున్నారు. సోమ‌వారం కేవ‌లం 10 వేల మంది భ‌క్తులు మాత్రమే వ‌చ్చిన‌ట్టు సమాచారం. మంగ‌ళ‌వారం గుట్ట మీద కేవ‌లం స్థానికులు, వ్యాపారులు, దేవాల‌యం సిబ్బంది మిన‌హా ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో దేవాల‌యంపై ఆధారప‌డిన చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేనేత‌కు దెబ్బ.. పౌల్ట్రీ విలవిల‌

కరోనా ఎఫెక్ట్‌తో చేనేత‌కు ప్రసిద్ధి చెందిన పోచంప‌ల్లిలో మ‌గ్గాలు మూల‌కు ప‌డుతున్నాయి. ఇక్కత్ చీర‌ల త‌యారీకి కావాల్సిన ముడి స‌రుకులు యార‌న్ వార్పు, సిల్కు నూలు రంగులు ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చైనా నుంచి దిగుమ‌తులు నిలిపేసింది. దీంతో చీర‌ల త‌యారీకి కావాల్సిన ముడిస‌రుకుల ధ‌ర‌లు మార్కెట్‌లో విప‌రీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధ‌ర‌ల‌ కారణంగా ముడి స‌రుకులు కొనుగోలు చేయలేక వ‌స్ర్త ఉత్పత్తి బంద్ చేసినట్టు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రభావం 16,500 మంది కార్మికుల జీవోనోపాధిపై దెబ్బ ప‌డింది. అంతేకాకుండా ఈ రంగంపై ఆధారపడిన 20 వేల మందికి పైగా ఉపాధి కోల్పోతున్నారు. చికెన్ తినడం వ‌ల్ల క‌రోనా వైర‌స్ సోకుతుంద‌న్న ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీరంగానికి రూ.2 వేల కోట్ల న‌ష్టం వాటిల్లగా.. ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాలోనే సుమారు 300 కోట్ల మేర న‌ష్టం వాటిల్లిన‌ట్టు వ్యాపారులు చెబుతున్నారు. రూ.100కు రెండు కోళ్ల(నాలుగు కిలోల‌వి) చొప్పున విక్రయించారు. కిలో కోడి మాంసం రూ.30, స్కిన్ లెస్ రూ.40 చొప్పున విక్రయించ‌డం వ‌ల్ల ఈన‌ష్టం వాటిల్లింది. చికెన్ ధ‌ర‌లు పాతాళానికి ప‌డిపోయినా రెస్టారెంట్లు, హోట‌ల్స్‌లో మాత్రం చికెన్ బిర్యానీ ధ‌ర‌లు ప‌డిపోక‌పోవ‌డం విశేషం.

ఆగిన వ‌రికోత యంత్రాల దిగుమ‌తి..

చైనా నుంచి దిగుమ‌తుల‌ను నిషేధించడంతో వ‌రి కోత యంత్రాల దిగుమ‌తి నిలిచిపోయింది. మ‌రో 10 రోజుల్లో వ‌రి కోత‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో యంత్రాల కొనుగోలుకు డ‌బ్బులు క‌ట్టిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సీజ‌న్ త‌రువాత యంత్రాలు వ‌స్తే ఉప‌యోగమేంట‌ని మ‌ద‌న ప‌డుతున్నారు. దేశీయ యంత్రాల‌కు, చైనా యంత్రాల‌కు సుమారు రూ.10 ల‌క్షల వ‌ర‌కు ధ‌రలో వ్యత్యాసం ఉండ‌టంతో వ‌రికోత మిష‌న్ నిర్వాహ‌కులు చైనా యంత్రాల‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. వ‌రి కోత యంత్రాల దిగుమ‌తి నిలిచిపోవ‌డంతో సీజ‌న్‌లో యంత్రాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతుల‌పై ఎక‌రానికి అదనంగా మ‌రో రూ. 500 భారం ప‌డ‌నుంది.

త‌గ్గని రోగులు..

ప్రభుత్వ ఆస్పత్రులు, ఈఎస్ఐ ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య త‌గ్గింది. క‌రోనా వైర‌స్ సోకిన వారి కోసం ఉమ్మడి జిల్లాలోని భువ‌న‌గిరి, న‌ల్లగొండ‌, సూర్యాపేట‌, మిర్యాల‌గూడ స‌ర్కార్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల‌ను ఏర్పాటు చేశారు. ఈ విష‌యం తెలిసిన‌ప్పటి నుంచి ఓపీ రోగుల సంఖ్య త‌గ్గింది. భువ‌న‌గిరి ఈఎస్ఐ ఆస్పత్రికి నిత్యం వంద మందికి పైగా వ‌చ్చే వారు. కానీ మంగ‌ళ‌వారం కేవ‌లం ఐదుగురు రోగులు రావ‌డం ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

tags : Corona, Nalgonda, Yadagirigutta, Poultry, Handlooms, Ban on China Imports


Next Story

Most Viewed