ఇదీ రియల్ ఎస్టేట్.. రియల్ స్టేటస్!

by  |
ఇదీ రియల్ ఎస్టేట్.. రియల్ స్టేటస్!
X

దిశ, న్యూస్ బ్యూరో: ఇది ‘రియల్’ స్టోరీ. కార్మికుల కన్నీటికథ. బిల్డర్ల వ్యథ. భూమిని తొలచుకుని అంతెత్తున లేచిన భవనాలు.. వేలాది మధ్యతరగతి జీవుల ఆశల సౌధాలు.. కరోనా దెబ్బకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. లక్షలాది మంది కార్మికుల బతుకుదెరువును ప్రశ్నార్థం చేసింది. వలస కార్మికులకు వలపోత మిగిల్చింది. ఉపాధి లేక ఖాళీ కడుపున, కాలినడకన ఊరిబాట పట్టారు. ఆకాశహర్మ్యాలు నిర్మించే బిల్డర్లు నేలచూపులు చూడాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్ వల్ల భాగ్యనగరం, దాని శివారుల్లో రియల్ ఎస్టేట్ రంగంపై నీలిమేఘాలు కమ్ముకున్నతీరుపై ‘దిశ’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది…

పార పనికైనా, పాన పనికైనా, నల్లా బిగించాలన్నా, నట్టు బిగించాలన్నా పిలిస్తే పలికేటోళ్లు.. ఫోన్ చేస్తే నిమిషాల్లో మన ముందు వాలిపోయేవాళ్లు. యాప్‌లో ఆర్డర్ పెడితే అనుకున్నవేళకు అందుబాటులో ఉండేటోళ్లు. ఇది కరోనాకు ముందు పరిస్థితి. మరిప్పుడో! ఉలుకూలేదు, పలుకూలేదు. వారి జాడలేదు, పత్తాలేదు. ఇలాంటి పనులన్నీ చేసేది వలస కార్మికులే. ఒడిషా మొదలు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది పట్టణంలో బతుకుదామని వలసవచ్చారు. కానీ, కరోనా వైరస్ ఇప్పుడు వారికీ, మనకూ కష్టాలు తెచ్చిపెట్టింది. కన్నవూరులో కలోగంజో తాగి ఉండొచ్చు.. ఈ బాధలు పడలేం.. అంటూ వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఇక్కడే చిక్కుకుపోయిన మరికొంతమంది వెళ్ళిపోయేందుకే సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. నగరంలోని అనేక అపార్టుమెంట్లు, విల్లాలు, ఇళ్ళు, వాణిజ్య సముదాయాల పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. లాక్‌డౌన్ కాలం 45 రోజులే అనుకున్నా,దాని ప్రభావం ఏడాదికంటే ఎక్కువే ఉండే అవకాశముంది.

సుడిగుండంలో బిల్డర్లు…

ఫిబ్రవరి-మే నెలల మధ్య భవన నిర్మాణాలు జోరుగా సాగుతుంటాయని, లాక్‌డౌన్ వల్ల ఈసారి ఇంత విలువైన సమయం వృథా అయిందని, ఇక ఆర్థికంగా తాము చితికిపోయినట్లేనని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల నుంచి కొంత అడ్వాన్సు తీసుకుని నిర్మాణపనులు మొదలు పెట్టారు. ఒప్పందం ప్రకారం సమయానికి ఇళ్లు అప్పగించకపోతే ఘర్షణలు, కోర్టు కేసులు తప్పేలా లేవు. ప్రైవేటుగా ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పులుకుప్పలయ్యాయి.

సెల్లార్ నుంచి శ్లాబు దాకా…

ఒక అపార్టుమెంటు కట్టాలంటే సెల్లార్ దగ్గరి నుంచి చివరి అంతస్తు శ్లాబ్ వరకూ పనిచేసేది కార్మికులే. ఫ్లోరింగ్, సెంట్రింగ్, శ్లాబు వేయడం, కార్పెంటర్ పనులు, కరెంటు వైరింగ్, వాటర్ పైప్‌లైన్ ఫిట్టింగ్, ఫాల్స్ సీలింగ్… రంగురంగుల పెయింటింగ్ పనులు కూడా కార్మికులతోనే జరుగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల ప్రకారం.. సుమారు ఐదారు లక్షల మంది ఇలాంటి స్కిల్డ్ కార్మికులతోనే రాష్ట్రంలో నిర్మాణ రంగం నడుస్తోంది. మన రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు ఉపాధి దారి వెతుక్కుంటూ ముంబాయి, దుబాయి, గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలవారేమో పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వస్తున్నారు. మన దగ్గర పనిచేసేందుకు లక్షలాది మంది యువత ఉన్నా ఆయా పనుల్లో ప్రావీణ్యం లేకపోవడంతో మరో ప్రాంతానికి వలస వెళ్ళాల్సి వస్తోంది.

రాష్ట్ర అవసరాల మేరకు శిక్షణ అవసరం

మన రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర అవసరాలను తీర్చుకోవడంతోపాటు వారికి ఉపాధి కల్పించనట్లవుతుందని, దీనికిగాను స్కిల్ ట్రెయినింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నాలుగైదేళ్ల క్రితమే సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో సివిల్ పనులు చేసేవారు సుమారు మూడున్నర లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఇక అనుబంధంగా గ్రానైట్ ఫ్లోరింగ్, కార్పెంటర్ వర్కు, ఫాల్స్ సీలింగ్ లాంటి పనులు చేసేవారు దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఉన్నట్లు అంచనా. నోట్ల రద్దు సమయంలో ఎన్ని ఇబ్బందులెదురైనా నెట్టుకొచ్చిన ఈ వలస కార్మికులు ఇప్పుడు కరోనా కారణంగా బెంబేలెత్తిపోతున్నారు.

అర్ధాంతరంగా ఆగిన పనులు

జనతా కర్ఫ్యూ విధించేనాటికే నగర శివారు ప్రాంతాల్లో వేలాది భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి వలస కార్మికులు అందుబాటులో లేరు. అలాగే వదిలేస్తే ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. మరికొంతకాలం గడిస్తే రుతుపవనాలు వచ్చేస్తాయి. అక్టోబరు దాకా వర్షాలు తప్పవు. అప్పటిదాకా నిర్మాణాలు సాగవు. మళ్ళీ వలస కార్మికులు వస్తేనే ఆ పనులు పూర్తవుతాయి. ప్రస్తుతం కొద్దిమంది వలస కార్మికులు ఇక్కడే ఉండిపోయినా ఆ మేరకే పనులు జరుగుతాయి.

బిల్డర్లకు ఇబ్బందులు తప్పవు: వెంకట్రావు, బిల్డర్, శేరిలింగంపల్లి

లాక్‌డౌన్‌తో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. వలస కార్మికులు సొంత ఇంటి బాట పట్టారు. పనులు ముందుకు సాగడంలేదు. లాక్‌డౌన్ ముగిసినా కరోనా భయంతో కార్మికులు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. మన దగ్గర ఉన్న కార్మికులు ఈ పనులు చేయడానికి ముందుకు రారు. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో ఇండ్లను అప్పగించడం సాధ్యం కాదు. ఆలస్యం కారణంగా నిర్మాణ వ్యయం కొంత పెరుగుతుంది. దానికి తగినట్లుగా ఒప్పుకున్న ధర కంటే కొంత పెంచక తప్పదు. కానీ బుకింగ్ చేసుకున్న వినియోగదారులు ఒప్పుకోరు. చివరకు మాకు, వినియోగదారులకు గొడవలు అవుతాయి. పనుల కోసం ప్రైవేటు వ్యక్తుల దగ్గరి నుంచి ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్న అప్పుల భారం ఇంకా పెరగకతప్పదు. 45 రోజుల లాక్‌డౌన్ ప్రభావం ఏడాదిదాకా వెంటాడుతుంది”

ఆంక్షలు తొలగిస్తే బాధ తప్పేది: చంద్రశేఖర్, బిల్డర్

“లాక్‌డౌన్ సమయంలోనూ కార్మికులు అందుబాటులో ఉన్నా హోంశాఖ ఆదేశాలతో పనులు ఆపాల్సి వచ్చింది. నలభై రోజులుగా కార్మికుల వసతి, ఆహార అవసరాలను తీరుస్తున్నాం. ఖాళీగానే కూర్చోబెట్టాల్సి వచ్చింది. కనీస జాగ్రత్తలు తీసుకుంటూ పనులు ప్రారంభించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బాగుండేది. 20 వేల చదరపు మీటర్లకంటే ఎక్కువ విస్తీర్ణంలో భవనం కట్టాలంటే కాలుష్యనియంత్రణ మండలి అనుమతి తప్పనిసరి. కానీ, 2018 ఏప్రిల్ నుంచి 2019 ఆగస్టు వరకు అది ఉనికిలోనే లేదు. దీంతో ఒకటిన్నర సంవత్సరం పాటు అనుమతులు రాక ప్రాజెక్టులు మొదలుకాలేదు. అలా కొంత నష్టపోయాం. నిర్మాణ పనులు మొదలై సెంట్రింగ్ దగ్గరకు వచ్చేసరికి లాక్‌డౌన్ వచ్చి పడింది. ఇప్పుడు వలస కార్మికులు సొంతూళ్ళకు వెళ్ళిపోడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంత మంది ఉంటారో, సొంతూళ్ళకు వెళ్ళిపోతారో తెలియదు. ఇప్పుడు మా ముందున్నది ముళ్ళబాటే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి భరోసా రాలేదు”

ఇండ్లకు పోయారు : దుగుంట్ల నరేష్, బిల్డర్

“చిన్న, చిన్న బిల్డర్లకు ప్రస్తుతం కష్ట కాలమే. నాలుగు నెలలకు ఒకటి చొప్పునన రోజువారీ కూలీలతో ఇళ్ళు నిర్మిస్తాను. పనులు మొదలయ్యాయిగానీ పూర్తి కాలేదు. లాక్‌డౌన్ రావడంతో వలస కార్మికులు స్వరాష్ట్రాలకు, మన కూలీలు సొంతూళ్లకు వెళ్ళిపోయారు. మన కూలీలకు తగిన స్కిల్స్ లేకపోవడంతో వలస కూలీలపై ఆధారపడాల్సి వస్తోంది. పది రోజులకు ఒక శ్లాబ్ వేయగలుగుతాం. వలస కార్మికులకు స్కిల్‌ను బట్టి వెయ్యి రూపాయల వరకు రోజు కూలీ ఇస్తాం. ఒక ఇంటి పనులు శ్లాబ్ దాకా రావడానికి వందమంది పనిచేయాల్సి ఉంటుంది. లక్ష రూపాయలు కూలీలకే పోతాయి. ఈ విపత్కర పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు”

tags: real estate, hyderabad, builders, labourers


Next Story

Most Viewed