కరోనా ఆ కుటుంబాన్ని ఓడించింది.. అందుకే..!

by Sumithra |
కరోనా ఆ కుటుంబాన్ని ఓడించింది.. అందుకే..!
X

దిశ, చార్మినార్: ఓ వైపు కరోనా వైరస్​వ్యాప్తి.. మరో వైపు ఒంటరితనం.. ఇటు పేదరికం.. అటు పెద్ద దిక్కు లేని ఆ కుటుంబం.. వారి పాలిట శాపంగా మారింది. అసలే లాక్‌డౌన్ వేళ ఆ కుటుంబానికి పూట గడపాలన్న కష్టంగా మారింది. ఎవరిని తమను అదుకొమ్మని అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. తమ బాధను మరొకిరికి చెప్పుకోలేక లోలోనే కుమిలిపోయారు. ఆర్ధిక సమస్యలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హృదయవిదారక సంఘటన హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది.

హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ పురాణాపూల్ చంద్రికాపురం పార్థీవాడకు చెందిన కె.లింగేశ్వర్ రావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు కె.మధుసూదన్ రావు(38), కుమార్తె ప్రేమలత(36), చిన్న కుమారుడు సందీప్ కుమార్ (32). కొన్నేళ్ల క్రితమే తండ్రి లింగేశ్వర్ రావు, అతని భార్య ఇద్దరు మృతి చెందారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో అన్నా తమ్ముళ్ళు ఒక చెల్లె నివసిస్తున్నారు. వీరికి ఎవరికి ఇంకా వివాహం కాలేదు. యుక్త వయస్సు దాటినా పెళ్లి చేసుకోలేని నిరుపేదరికంలో ఉన్నారు. అందుకే ఆ కుటుంబం జీవన పోరాటంలో ఓడిపోయింది. ఎవరికి ఉద్యోగాలు లేక, చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి లేక అలమటిస్తున్న తరుణంలో లాక్‌డౌన్ రావడం మరింత ఇబ్బందిగా మారింది.

పస్తులు ఉండలేకపోయారు. ఇంత వయస్సు వచ్చినా వివాహాలు కాలేవని తీవ్ర మానసిక ఒత్తిడి గురైన ముగ్గురు ఆత్మహత్య చేసుకుంనేందుకు సిద్ధపడ్డారు. శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు లేచిన మధుసూదన్, సందీప్, ప్రేమలతలు ఇంటి పరిసర ప్రాంతాలలో కలియ తిరిగారు. కాసేపటికే ఇంట్లోకి వెళ్లిపోయారు. సాయంత్రం అవుతున్న ఇంటి తలుపులు తెరవక పోవడం, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో స్థానికులు ఆ ఇంటి వెనుక డోర్ నుంచి లోపలికి వెళ్ళి చూడగా ముగ్గురు ఫ్యాన్ దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న హుస్సేనీహాలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు మృతదేహాలకు శవ పంచనామ నిర్వహించారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆ ముగ్గురి ఆత్మహత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును హుస్సేనీహాలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed