కరోనా కేసుల్లో ఎందుకీ దాపరికం?

by  |
కరోనా కేసుల్లో ఎందుకీ దాపరికం?
X

దిశ, న్యూస్ బ్యూరో: ఆర్టీసీ సమ్మె సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయని హైకోర్టు అప్పట్లో ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇప్పుడు కరోనా లెక్కలు కూడా అలాగే ఉంటున్నాయి. కరోనా కట్టడి విషయంలో ప్రజలు, మీడియా సహకారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఇచ్చే అధికారిక లెక్కలనే ప్రచురించాలని, ప్రసారం చేయాలని, ఊహాగానాలు వద్దని మీడియాకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం రెండు బులెటిన్లను జారీ చేస్తామని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కానీ ఆచరణలో ఈ రెండూ అటకెక్కాయి. రోజూ రెండు బులెటిన్లు విడుదల కావడంలేదు. విడుదలవుతున్న బులెటిన్లు కూడా రాత్రి 8.00 గంటల సమయాన్ని పేర్కొంటూ అర్ధరాత్రికి వస్తున్నాయి. అవి కూడా అరకొర సమాచారంతోనే అసంపూర్తిగా ఉంటున్నాయి. గణాంకాల్లో తప్పులు దొర్లినట్లు గ్రహించి మళ్ళీ అర్ధరాత్రి దాటిన తర్వాత సవరించి బులెటిన్ వస్తోంది. ‘వాస్తవాలు చెప్పడానికి ప్రభుత్వానికి భయమెందుకుంటుందండీ’ అని కేసీఆర్ చెప్తుంటారు. కానీ జరిగేది మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. ‘దాపరికం ఎందుకుండాల’ని కేసీఆర్ ప్రశ్నిస్తూనే చాలా విషయాలు బైటకు పొక్కకుండా దాచిపెడుతున్నట్లు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలే స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ ఉంటే ప్రజలు ‘పానిక్’ అవుతారన్నది ప్రభుత్వ భావన కాబోలు! కానీ వాస్తవిక లెక్కలను దాచిపెట్టడం ద్వారా అంతకంటే ఎక్కువ ‘పానిక్’ పరిస్థితులకు ఆస్కారం కల్పించినట్లవుతోంది. లెక్కలు దాగినంతమాత్రాన పాజిటివ్‌లు నమోదుకాకుండాపోవు. తమిళనాడులో ఒకేరోజు 110 కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం చెప్పుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఒకే రోజున 67 కేసులు నమోదైనట్లు చెప్పుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వ తీరు మాత్రం ఆ తరహాలో లేదు. బుధవారం తొలుత పన్నెండు కేసులు అంటూ రాత్రి 8.00 గంటలకు తయారుచేసిన బులెటిన్‌లోని వివరాలను రాత్రి 11.15 గంటలకు చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ గంటకు ఇంకో 18 కేసులు పెరిగాయంటూ ఇంకో సవరణ ప్రకటనలో చెప్తుంది. కరోనా మరణాల విషయంలోనూ ఇవే గందరగోళ లెక్కలు ఉంటున్నాయి. ప్రభుత్వం వెలువరిస్తున్న లెక్కలు నిజమైనవేనా అనే అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది.

చనిపోయినవారూ బతికారా?

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 30వ తేదీ రాత్రి (11.00 గంటలకు) రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కానీ రెండు రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 1వ తేదీన, రాత్రి 11.15 గంటలకు వెలువరించిన సమాచారంలో మాత్రం మొత్తం ఐదుగురు చనిపోయినట్లు పేర్కొన్నారు. అంటే చనిపోయిన ఒక వ్యక్తి బతికి బైటపడ్డారా? లేక తాజాగా ఇచ్చిన లెక్కల్లో తప్పు ఉందా? ఒకవేళ తప్పు ఉన్నట్లు భావిస్తే ఆ గణాంకాలతో బులెటిన్‌ను తయారుచేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనుకోవాలా? ఈ తప్పుడు లెక్కలు గందరగోళం సృష్టించడంతో మళ్ళీ ఏప్రిల్ 1 అర్ధరాత్రి తర్వాత మొత్తం మృతుల సంఖ్య తొమ్మిది అని సవరించాల్సి వచ్చింది. నిజానికి ముఖ్యమంత్రి మార్చి 30వ తేదీన ట్విట్టర్ ప్రకటన నాటికి ఆరుగురు చనిపోగా ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో ఇంకొకరు (ఏప్రిల్ 1న) చనిపోయారు. ఏప్రిల్ 1న ఒక వార్తా ఏజెన్సీతో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘నిన్న మరో ఇద్దరు చనిపోయారు’ (అంటే మార్చి 31న) అని వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం చూస్తే మొత్తం తొమ్మిది మంది చనిపోయినట్లవుతుంది. ఇంత గందరగోళం చోటుచేసుకోవడంతో ఆ పొరపాట్లను సరిదిద్దుకోడానికి అర్ధరాత్రి తర్వాత సవరణ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది.

బులెటిన్ విధానానికి తిలోదకాలు !

తెలంగాణలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు మార్చి 4వ తేదీన నమోదైనప్పటి నుంచి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బులెటిన్లను విడుదల చేస్తూ వచ్చింది. దాదాపు ఇరవై రోజుల పాటు ఈ విధానం కొనసాగింది. దీంతో ప్రసార మాధ్యమాల్లో ఊహాగానాలకు తావులేకుండా ప్రభుత్వం అధికారికంగా వెలువరించిన గణాంకాలే ప్రసారం అవుతున్నాయి. ఈ కారణంగా ప్రజల్లో గందరగోళం తగ్గిపోయింది. కానీ యశోదా ఆసుపత్రిలో ఒక విభాగాధిపతిగా ఉన్న డాక్టర్‌కు, ఆయన భార్యకు, కుటుంబంలోని మరొకరికి పాజిటివ్ వచ్చిందని తెలియడంతో ఆ రోజు నుంచి బులెటిన్ల విడుదలలో పద్ధతి లేకుండాపోయింది. బులెటిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు వస్తుందో రాదో తెలియదు. వచ్చినా సాయంత్రానికి బదులుగా అర్ధరాత్రిపూట ట్విట్టర్ ద్వారానో, మెయిల్ ద్వారానో ప్రభుత్వం వెలువరిస్తోంది. వైద్యశాఖ అధికారులు అనధికారికంగా చెప్పే గణాంకాలు ఒక రకంగా ఉంటుంటే ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో మరో రకంగా ఉంటున్నాయి. ఏది నిజమో ప్రభుత్వానికే తెలియాలి.

దాపరికంతో మరింత నష్టం

కరోనా వ్యాధికి మందు లేదని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌లో భాగంగా ఇంటిపట్టునే ఉండాలని సూచించారు. అదే ఉత్తమమైన మందు అని కూడా అన్నారు. ప్రజలకు ఈ తరహా జాగ్రత్తలు చెప్తూ వారిని అప్రమత్తం చేశారు. కానీ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మాత్రం వాస్తవాలను దాచిపెడుతున్నట్లు రెండు సందర్భాల్లో స్పష్టమైంది. మార్చి 30వ తేదీ నాటికే ఆరుగురు మృతి చెందగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మాత్రం ఐదుగురు మాత్రమే మృతిచెందినట్లు చెప్పింది ప్రభుత్వం. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8.00 గంటల బులెటిన్‌ను రాత్రి 11.15 గంటలకు విడుదల చేసి అందులో పన్నెండు మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు చెప్పింది. కానీ గంటన్నర తర్వాత మళ్ళీ 30 మంది మృతి చెందినట్లు చెప్పింది. అన్ని జిల్లాల నుంచి సమాచారం రావడంలో ఆలస్యం, క్రోడీకరించుకోడానికి సమయం పట్టినందునే ఆలస్యమైనట్లు ప్రభుత్వం సమర్ధించుకోవచ్చు. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో మొత్తంగా నమోదైన 127 పాజిటివ్ కేసుల్లో ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది బైటకు రాలేదు. కారణాలు తెలియదు.

ఎప్పటికప్పుడు పూర్తి వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది. కానీ ఇప్పటికీ ఏ జిల్లాలో పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయి, చనిపోయినవారు ఏ జిల్లాకు చెందినవారు, ఏయే జిల్లాలకు చెందినవారు ఎంత మంది అనుమానితులుగా ఐసొలేషన్ వార్డుల్లో ఉంటున్నారు తదితరాలేవీ తెలియకపోవడంతో అక్కడి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. మర్కజ్ మసీదుకు ప్రార్థనల కోసం వెళ్ళివచ్చినవారు 1200 మందికిపైగా ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కానీ ఏ జిల్లాలో ఎంతమందో ఇప్పటికీ బైటకు రాకపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోడానికి ఆస్కారం లేకుండాపోయింది. పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో తమిళనాడులో ఒకేరోజున 110 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 67 కేసులు వచ్చినట్లు ఆ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నాయా అని ప్రజల్లో ఆందోళన రావచ్చుగానీ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోడానికి ఉపయోగపడింది. పైగా ఏ జిల్లావారు ఎంతమంది మర్కజ్‌కు వెళ్ళివచ్చారనేదా మొబైల్ నెంబర్లు, గ్రామాల పేర్లతో సహా ఇవ్వడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ‘ప్రజలు పానిక్ అవుతారు’ అనే అభిప్రాయంతో కరోనా లెక్కల్లో గందరగోళం కనిపిస్తూ ఉంది. ఫలితంగా ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోడానికి వీలు లేకుండా పోయింది.

Tags : Telangana, CMO, Corona, Deaths, Positive, Twitter, Health Minister


Next Story