దేశంలో 14లక్షలు దాటిన కరోనా కేసులు

by vinod kumar |
దేశంలో 14లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో ఒక్కరోజులో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య వరుసగా నాలుగో రోజు 40వేల మార్కు దాటింది. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24గంటల్లో అత్యధికంగా 48,661 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 13,85,552కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి వివిధ రాష్ట్రాల కేసుల బులెటిన్‌లు వెలువడడంతో ఈసంఖ్య 14 లక్షలు దాటింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే 705మంది మరణించారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 32,063కు చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా మరణాల్లో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 8,85,577 మంది కోలుకోగా ప్రస్తుతం 4,67,882 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశంలో కరోనా రికవరీ రేటు 63శాతంగా ఉండగా మరణాల రేటు 2.35శాతంగా ఉంది.

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో గడిచిన కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతోంది. ఒక్కరోజులో నమోదైన 1075 పాజిటివ్‌లతో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,30,606కు చేరింది. 21 కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3827 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్క రోజులో 9431 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,75,799కి వెళ్లింది. 24గంటల్లో వైరస్ బారినపడి 267 మంది చనిపోగా మొత్తం మరణాలు 13,656కు చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 6986 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,13,723కు చేరింది. 85 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3494కు చేరింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 7627 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ఒక్కరోజే 56 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1041మంది మృత్యువాత పడ్డారు.

Advertisement

Next Story