కరోనా కథ మళ్లీ మొదటికి..

by vinod kumar |   ( Updated:2020-05-29 04:50:47.0  )
కరోనా కథ మళ్లీ మొదటికి..
X

సుమారు రెండు నెలల పాటు లాక్‌డౌన్ అనంతరం ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు పల్లెబాట పట్టారు. దీంతో కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇన్ని రోజులు తీసుకున్న జాగ్రత్తలు ప్రస్తుతం పాటించడం లేదు. కరోనా లెక్కల్లో అధికారులు గందరగోళానికి గురిచేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. వలస కూలీలు దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలతో తిరుగుతున్నా.. వైద్య సిబ్బంది గానీ, ఇతర అధికారులు గానీ వాటిని పట్టించుకోవడం లేదు. ఎవరైనా గ్రామస్థాయిలో ఫిర్యాదు చేస్తే లైట్ తీస్కోండి అంటూ ఉచిత సలహాలిస్తున్నారు. దీనికి తోడు ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించడం లేదు.

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కరోనా వైరస్ లక్షణాలు జిల్లాలో చాప కింద నీరులా మారాయి. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో కరోనా కేసులు పాజిటివ్ వచ్చాయంటూ అధికారులు నిర్ధారిస్తున్నారు. జిల్లా స్థాయికి వచ్చే సరికి కరోనా లెక్కల్లో ఆ కేసులను చూపడం లేదు. సూర్యాపేట జిల్లాలో గతంలోనే రికార్డు స్థాయిలో 83 పాజిటివ్ కేసులు నమోదుకావడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. తాజాగా ఈ జిల్లా పరిధిలో మూడు నాలుగు కేసులు నమోదయ్యాయి. కానీ జిల్లా అధికారుల లెక్కల్లో మాత్రం అవి కనిపించడం లేదు. జిల్లాలోనే తొలి కరోనా మరణం నమోదయ్యింది. సూర్యాపేట రూరల్ మండలంలోని కాసరబాద గ్రామంలో నాలుగేండ్ల బాలుడికి కరోనా పాజిటివ్ కేసుగా తేలింది. ఈ బాలుడికి ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామం నుంచి కరోనా సోకినట్టుగా అధికారులు భావిస్తున్నారు. జిల్లా పరిధిలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. దీన్ని స్థానిక వైద్యాధికారులు సైతం ధ్రువీకరించారు. కానీ జిల్లా స్థాయికి వచ్చే సరికి మాత్రం ఆ కరోనా కేసును లెక్కల్లో చూపించకపోవడం గమనార్హం. ఈ తరహా కేసులు జిల్లా పరిధిలో చాలా ఉన్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారుల నుంచి మాత్రం క్షేత్రస్థాయిలో స్పష్టత లేదు. కాసరబాద గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడి మృతిని కరోనా కేసుల్లో లెక్కకట్టలేదు. ఎందుకంటే.. కరోనా వైరస్ సోకిన నేపథ్యంలోనే బాలుడికి గుండెకు రంధ్రం పడింది. దీంతో అందువల్లే బాలుడు చనిపోయాడని అధికార యంత్రాంగం చెబుతోంది.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

ఉమ్మడి జిల్లాలో వలస కార్మికులకు సంబంధించి 41 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాదాద్రి-భువనగిరి జిల్లాలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులకు సంబంధించి నమూనా సేకరణలు భారీగానే తగ్గాయి. మే ఒకటో తేదీ నాటికి 1328 శాంపిళ్లు సేకరిస్తే.. మే 27వ తేదీ నాటికి అవి 1476గానే ఉన్నాయి. అంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో కేవలం 148 శాంపిళ్లు మాత్రమే సేకరించారంటే.. కరోనా కేసుల పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో అర్థమవుతోంది. ఈ శాంపల్స్ సైతం వలస కార్మికుల నుంచి ఎక్కువగా సేకరించినవే ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న రిపోర్టులు సైతం కేవలం 6 కావడం గమనార్హం. క్వారంటైన్ కేంద్రాల్లోనూ కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. వారు యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన వలస కార్మికులని అధికారులు చెబుతున్నారు.

లైట్ తీసుకుంటున్న ప్రజలు, అధికారులు

కరోనా వైరస్ పట్ల ఇటు ప్రజలు.. అటు అధికారులు లైట్ తీసుకుంటున్నారు. 90 శాతం మందికి పైగా కనీస రక్షణ చర్యలు పాటించడం లేదు. లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులివ్వడంతో కరోనా వైరస్‌కు గేట్లు తేరిచినట్టయ్యింది. ప్రజలు కనీసం మాస్కులు, శానిటైజర్లు సైతం వినియోగించడం లేదు. అధిక జన సమూహం ఉంటే సూపర్ మార్కెట్లు, మద్యం దుకాణాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అవేమీ కన్పించడం లేదు. రాత్రి ఎనిమిది గంటలవుతున్నా కొన్ని దుకాణాలను మూయడం లేదు.

Advertisement

Next Story

Most Viewed