కరోనాకు కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీ!

by  |
కరోనాకు కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీ!
X

కొవిడ్ 19కు మందు కనిపెట్టడానికి డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. కానీ ఇప్పటికీ సోకిన వాళ్లకు ట్రీట్‌మెంట్ చేయడానికి కూడా ఏదో ఒక దారి వెతకాలి కదా! ఆ దారే.. కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీ రూపంలో వచ్చింది. దీని ద్వారా కరోనా పూర్తిగా నయమవుతుందని చెప్పలేం కానీ ఎంతో కొంత ఉపశమనం మాత్రం దొరుకుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే అధికారికంగా ఇదే ట్రీట్‌మెంట్ అని ఎవరూ స్పష్టం చేయకపోయినప్పటికీ దీనిని ప్రయోగాత్మకంగా కొవిడ్ 19 పేషెంట్ల మీద ఉపయోగించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీ గురించి కొన్ని వివరాలు మీకోసం!

కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీ అంటే?

రక్తంలో ద్రవరూప భాగంలో ప్లాస్మా ఒకటి. లేత పసుపు రంగులో ఉండే ఈ ప్లాస్మాలో 91 నుంచి 95 శాతం నీరే ఉంటుంది. మొత్తం రక్తంలో 55 శాతం ప్లాస్మా ఉండగా, 45 శాతం తెల్ల, ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఈ కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీలో ప్రధానంగా ఉపయోగించేది ఈ ప్లాస్మానే. రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి ఉపయోగిస్తారు. మానవ శరీరం ఏదైనా పాథోజెన్ దాడికి గురైనపుడు వ్యాధి నిరోధక శక్తి ఉత్తేజితమై యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాస్మా థెరపీలో కొవిడ్ నుంచి బయటపడిన వ్యక్తి నుంచి యాంటీ బాడీస్‌ను సేకరిస్తారు. తర్వాత వాటిని జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి ఎక్కిస్తారు. అప్పుడు యాంటీ బాడీస్, జబ్బు పడిన వ్యక్తి శరీరంలో పాసివ్ ఇమ్యునైజేషన్‌ను సృష్టిస్తాయి. దీని ద్వారా ఆ రోగి వైరస్‌తో పోరాడి గెలవగలుగుతాడు.

సురక్షితమేనా?

సాధారణంగా ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్లు చాలా సురక్షితం. అయితే ముట్టుకుంటే అంటుకునే ఈ కొవిడ్ 19 లాంటి జబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్లాస్మా థెరపీ చేయించుకున్న పేషెంట్లలో 95 శాతం మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించవు. కానీ 5 శాతం మందిలో మాత్రం కొన్ని ఎలర్జిక్ ప్రతిచర్యలు కనిపించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి ఈ ప్లాస్మా థెరపీ సమర్థవంతంగా పనిచేసి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉందని చెప్పుకోవచ్చు.

ఇప్పటివరకు కొవిడ్ 19కు ఎలాంటి అధికారిక చికిత్సా విధానం లేని కారణంగా, ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తున్న చికిత్సలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగాలు ఎక్కువగానే కనిపిస్తుండటంతో దీన్ని ప్రయోగాత్మకంగా పేషెంట్ల మీద ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని బట్టి చూస్తే ప్లాస్మా థెరపీని కొవిడ్ 19కు అధికారిక చికిత్సగా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా బారిన పడి విషమ పరిస్థితిలో ఉన్న వారి మీద చివరి ప్రయత్నంగా ఈ కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీని ఉపయోగించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి వారు రాష్ట్రాలకు అనుమతినిచ్చారు. అయితే ప్లాస్మా థెరపీని ఇంకా తాము అందరూ పేషెంట్లకు సిఫారసు చేయలేదని ఐసీఎంఆర్ స్పష్టతనిచ్చిన విషయం గ్రహించాలి. ఏదేమైనా రోగం తెచ్చుకుని చికిత్స కోసం తిరుగుతూ, వైద్యులను ఆరోపించడానికి బదులుగా రోగాన్ని తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నించడమే ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.



Next Story