కేసీఆర్ మాట్లాడేది మత్తులోనే.. సీఎంపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

by Shyam |
YS Sharmila
X

దిశ, నకిరేకల్: దేశంలోనే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటానికి సీఎం కేసీఆర్ కారణమని వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఆలస్యం చేసినా.. వారి కుటుంబంలో మాత్రం ఐదు ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నారని విమర్శించారు. వైఎస్సార్ బతికుంటే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు దశాబ్ద కాలం కిందటే పూర్తయ్యేదని తెలిపారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలం వెలికట్ట గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం 7:30 కిలోమీటర్లు సాగింది. అదేవిధంగా ప్రతి మంగళవారం నిర్వహించే నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా నార్కట్ పల్లి మండలం లోని చౌడంపల్లి గ్రామంలో సాయంత్రం ఐదు గంటల వరకు వైయస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు.

Sharmila

అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే 80 శాతం పూర్తయిన ఉదయ సముద్రం ప్రాజెక్టుకు కేసీఆర్ నిధులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.100 కోట్లు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టును 14 ఏళ్లుగా పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ పాలించే తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నర ఏళ్లలో 8 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రైతులను వరి సాగు చేయొద్దంటూ అయోమయానికి గురి చేస్తున్న కేసీఆర్‌కు రాబోయే రోజుల్లో తగిన శాస్తి తగులుతుందని అన్నారు. వరి సాగు వద్దంటే లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కొనడం లేదంటూ కుంటి సాకులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

Sharmila Padayathra

80 వేల పుస్తకాలు చదివాను అన్న కేసీఆర్‌కు ఒక్క రైతు పుస్తకమైన దొరకలేదా.. రైతులపై ఎందుకింత వివక్ష అంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు మాయమాటలు చెబుతూ మభ్య పెడుతున్నారని విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన మాటలు ఎటు పోయాయని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ మత్తులో మాత్రమే మాట్లాడతారు తప్ప ప్రజల కోసం ఎటువంటి పనులు చేయలేదని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చేసిన విద్యార్థులు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటే కళ్లకు కనిపించడం లేదన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్ వేయడంలో ఆలస్యం చేసిన.. బార్ నోటిఫికేషన్‌లో మాత్రం కేసీఆర్ ముందు ఉన్నారన్నారు. ఏదేమైనప్పటికీ రాజన్న రాజ్యం తెలంగాణలో రావాలన్నారు. కేసీఆర్ కేవలం కుటుంబ లాభం తప్ప రాష్ట్ర ప్రజలపై మాత్రం అప్పులు మిగిలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. వరి సాగు చేస్తే ఇబ్బందులు తప్పవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదేమైనప్పటికీ కేసీఆర్ అరాచక పాలనతో ప్రజలను ఇబ్బందులకు పెడుతున్నాడని, త్వరలోనే ఆయన పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed